19న రాష్ట్ర స్థాయి పోలీస్‌ సదస్సు

4 May, 2017 07:59 IST|Sakshi
19న రాష్ట్ర స్థాయి పోలీస్‌ సదస్సు

ఎస్‌ఐ నుంచి డీజీపీ వరకు అందరితో సీఎం సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈనెల 19న రాష్ట్రస్థాయి పోలీస్‌ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం 11 నుంచి జరిగే విస్తృత సదస్సులో వివిధ స్థాయిల పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చిస్తారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలైన పోలీసు అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం భావిస్తున్నారు. పోలీసు శాఖను మరింత బలోపేతం చేయడానికి, సమాజానికి ఉపయోగపడేవిధంగా మరిన్ని కార్యక్రమాలను పోలీసు శాఖ ద్వారా చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాలు, ప్రమాదాలు, మాఫియా శక్తుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపైనా విస్తృతంగా చర్చించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో మాట్లాడితేనే కష్టనష్టాలు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ముఖ్యమంత్రే స్వయంగా అందరు అధికారులతో మాట్లాడాలని నిర్ణయించారు.

అన్ని స్థాయిల అధికారులకు ఆహ్వానం
శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న ఎస్‌ఐ స్థాయి నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల పోలీసు అధికారులను, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారులను ఈ సదస్సుకు ఆహ్వానించాలని డీజీపీ అనురాగ్‌ శర్మను సీఎం ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఫర్నిచర్‌ ఉందా? భవనం పరిస్థితి ఏంటి? ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గుడుంబా, పేకాట, సట్టా తదితర అసాంఘిక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయా? డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో ఎలా అదుపు చేయాలి? మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మే దుర్మార్గాన్ని ఎలా అరికట్టాలి? వ్యభిచార గృహాలెక్కడైనా నడుస్తున్నాయా? ఎస్సీ, ఎస్టీలకు ఎదురయ్యే అవమానాలు, అఘాయిత్యాల విషయంలో ఎలా స్పందిస్తున్నారు? ఇతర నేరాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి, పరిష్కార మార్గాలు ఆలోచించనున్నారు. ఈ సదస్సుకు అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని సీఎం కోరారు.

>
మరిన్ని వార్తలు