హైనన్ ప్రావిన్స్‌తో రాష్ట్రం ఎంవోయూ

21 Jun, 2016 00:01 IST|Sakshi
హైనన్ ప్రావిన్స్‌తో రాష్ట్రం ఎంవోయూ

- చైనాతో తెలంగాణ మైత్రీ బంధం
- ఐటీ, తయారీ రంగాల్లో పరస్పర సహకారానికి కృషి
- మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇరుపక్షాల సంతకాలు
- పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మారుస్తాం: కేటీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: చైనాలోని హైనన్ ప్రావిన్స్ (రాష్ట్రం)తో తెలంగాణ దృఢ మైత్రీ బంధం ఏర్పరుచుకుంటుందని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. హైనన్ ప్రావిన్స్, రాష్ట్రం నడుమ మైత్రీ బంధానికి (సిస్టర్ ప్రావిన్స్ రిలేషన్) సంబంధించి సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హైనన్ ప్రావిన్స్ తరఫున అక్కడి గవర్నర్ లీ సుగుయ్ సంతకాలు చేశారు. ఈ ఎంవోయూ ప్రకారం ఇరుపక్షాలు ఐటీ, తయారీ, ఇతర రంగాల్లో సహకారానికి సమానత్వం, పరస్పర లబ్ధి ప్రాతిపదికన కృషి చేస్తాయి.

తద్వారా స్నేహ సంబంధాలతోపాటు ఆర్థిక, వాణిజ్య బంధాలను ఏర్పరచుకుంటాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా చైనా ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులకు తెలంగాణను ప్రథమ గమ్యస్థానంగా మారుస్తామన్నారు. పరస్పర వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కలసి నడుస్తామని సుగుయ్ తెలిపారు. హైనన్ ప్రావిన్స్‌లో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను లీ సుగుయ్ ఆహ్వానించగా మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు హైనన్ ప్రావిన్స్‌తో టీ హబ్ మరో ఎంవోయూ కుదుర్చుకోగా హైనన్ ప్రావిన్స్‌లో ఆస్పత్రి స్థాపనకు అపోలో హాస్పిటల్స్ కూడా ఎంవోయూ కుదర్చుకుంది. సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులతోపాటు హైనన్ ప్రావిన్స్ ప్రతినిధులు లూ జియువాన్, వాంగ్ షెంగ్, ఎల్‌వీ యాంగ్, హాన్ యాంగ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు