ఛీ.. కంపు కంపు!

8 May, 2015 02:53 IST|Sakshi
ఛీ.. కంపు కంపు!

సైదాబాద్: ప్రధాన ర హదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన, వ్యర్థాల పారబోత వల్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్వాసనను భరించలేక నిత్యం అవస్థల పాలవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గడ్డిఅన్నారం నుంచి సరూర్‌నగర్ వెళ్లే దారిలో గంగా థియేటర్ పక్కనే కొంత ఖాళీ స్థలం ఉంది. దీనికి ఆనుకుని ప్రహరీ నిర్మించి వదిలేశారు. ఈ దారి గుండా వెళ్లే వారు ఈ స్థలాన్ని మూత్ర విసర్జనకు అడ్డాగా మార్చేశారు. ఫలితంగా ఈ రూట్లో వెళ్లేందుకు మహిళలు జంకుతున్నారు. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్వాసనతో చుట్టుపక్క అపార్ట్‌మెంట్లవాసులు ఇక్కట్ల పాలవుతున్నారు. వేసవికాలంలో కనీసం బాల్కనీలో కూర్చోలేకుండా పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాలికి వ్యాపిస్తున్న కంపుతో ఇంటి తలుపులు కూడా తెరవలేకపోతున్నామని చెబుతున్నారు. దుర్గంధంతో తమ దుకాణాలు, హోటళ్ల వద్దకు ఎవరూ రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పక్కనే ఉన్న గల్లీలోని డ్రైనేజీని పూడిక తీయకపోవడంతో ఈ ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. దీనికి ఎదురుగానే సాయిరాంనగర్ కాలనీకి చెందిన బస్టాప్ ఉంది. నిత్యం ఇక్కడి నుంచి ఎంతో మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఎదురుగా టాయిలెట్స్ పోస్తుండటంతో బస్టాప్‌లో నిలబడేందుకు మహిళలు, యువతులు ఇబ్బంది పడుతున్నారు. ముక్కు మూసుకుని బస్సులు, ఆటోల కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. వేసవిలోనే ఇలా ఉంటే వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడి ప్రహరీ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టి, మట్టితో చదును చేసి టాయిలెట్స్ పోయకుండా గోడ రాతలతో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  
 
భరించలేని వాసన
 
ఖాళీ స్థలం చుట్టు ఉన్న గోడ వద్ద నిత్యం వందల సంఖ్యలో బాటసారులు, వాహనదారులు, ఆటోవాలాలు మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో  ఇక్కడ వ్యాపారం చేసుకునే వారితో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
     - విజయేందర్, కాలనీ సభ్యుడు
 
అధికారులు స్పందించాలి
 
అవసరాల నిమిత్తం దుకాణాలకు వచ్చే వినియోగదారులు ఇక్కడ క్షణం కూడా నిలబడలేక పోతున్నారు. పక్క హోటల్ పరిస్థితి కూడా ఇదే.  ఖాళీ స్థలాలు టాయిలెట్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. కాలనీ మధ్యలో మూత్రశాలలు ఇబ్బంది పెడుతున్నాయి. అధికారులు స్పందించాలి.     - రవి, దుకాణ యజమాని
 

మరిన్ని వార్తలు