కామాంధులు

11 Jun, 2017 09:01 IST|Sakshi
కామాంధులు

►బాలికపై లైంగికదాడికి పాల్పడిన పెంపుడు తండ్రి, ఇద్దరు యువకుల అరెస్టు 
►గర్భం దాల్చిన బాధితురాలు


ముషీరాబాద్‌: 
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆమె పెంపుడు తండ్రి, ఇద్దరు యువకులను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రాం చంద్రారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్‌ డివిజన్‌ బాపూజీనగర్‌కు చెందిన బాలిక తల్లితో కలిసి ఉంటోంది. నాలుగేళ్ల క్రితం ఆమె తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో  బాలిక తల్లి బాపూజీనగర్‌కు చెందిన క్యాటరింగ్‌ కార్మికుడు హరీష్‌ కృష్ణమూర్తి (39)ని పెళ్లి చేసుకుంది. వీరు గతంలో వారాసిగూడ ప్రాంతంలో ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన టెం ట్‌హౌజ్‌ కార్మికడు సాయికిరణ్‌తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించిన సాయికిరణ్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు.

అంతేగాక అతను తన స్నేహితుడు వారాసిగూడకు చెందిన ఆటో డ్రైవర్‌ నక్కరాజు (19)కు ఆమెను పరిచయం చేశాడు. దీనిని సాకుగా తీసుకున్న రాజు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పెంపుడు తండ్రి కూడా ఆమెపై రెండుసార్లు లైంగికదాడికి పాల్పడినా భయంతో బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. శనివారం ఆమె తన తల్లికి ఈ విషయం చెప్పడంతో ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా మూడో నెల అని తేలింది.

ప్రభుత్వ వసతి గృహానికి తరలించాలి
పెంపుడు తండ్రి, మరో ఇద్దరు యువకుల చేతిలో మోసపోయిన బాలికను వెంటనే ప్రభుత్వ బాలికల వసతి గృహానికి తరలించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తల్లి వైఖరిపై అనుమానాలున్నందున ఆమెను కూడా విచారించాలని కోరారు.