వీధికుక్కకు పోస్టుమార్టం పూర్తి

11 May, 2016 15:48 IST|Sakshi
వీధికుక్కకు పోస్టుమార్టం పూర్తి

మెదడు భాగాలు విశ్లేషణ కోసం ఇన్‌స్టిట్యూట్‌కు
కళేబరం జంతు పరిరక్షణ  బృందానికి అప్పగింత
కేసు దర్యాప్తులో ఉంది: ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్

 
 
పెద్దఅంబర్‌పేట
: హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో వెంకటేశం, మల్లేష్‌ల చేతిలో ‘హత్య’కు గురైన వీధికుక్క కళేబరానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ ఉదంతంపై జంతు ప్రేమికురాలు ప్రియాంక ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భాగ్యలత కాలనీ పాతరోడ్డుకు చెందిన వెంకటేశం భార్యను ఓ వీధికుక్క కరిచింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన కుమారుడు మల్లేష్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం దాన్ని చంపారు. ఆ కళేబరాన్ని వీరు పట్టుకుని వెళ్తుండగా స్థానికంగా ఉండే ప్రియాంక గమనించారు.

ఆమె ఈ విషయాన్ని జంతు పరిరక్షణ బృందమైన బ్లూక్రాస్‌కు తెలిపారు. దీంతో బ్లూక్రాస్ ప్రతినిధి ప్రవళిక కళేబరాన్ని హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దాన్ని చంపిన వారిపై కేసు నమోదు చేయాలని ఇన్‌స్పెక్టర్ జె.నరేందర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటేశం, మల్లేష్‌లపై పోలీసులు ఐపీసీలోని 428 (ఉద్దేశపూర్వకంగా దుందుడుకు స్వభావంతో జంతువును చంపడం), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్-1950 లోని సెక్షన్ 11, యానియల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2011 కింద కేసు నమోదు చేసి కళేబరాన్ని భద్రపరిచారు. ఆ వీధికుక్కకు వాక్సినేషన్ వేశారని, అది కరిచినా ఎలాంటి ప్రమాదం లేదని, దాన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ప్రవళిక వాదించారు.

వెంకటేశం, మల్లేష్‌లతో పాటు కొందరు స్థానికులు సైతం ఆ కుక్కకు పిచ్చిపట్టిందని, వరుసగా అనేక మందిని కరుస్తోందని ఆరోపించారు. దీంతో కుక్క కళేబరానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని హయత్‌నగర్ పోలీసులు నిర్ణయించారు. కళేబరాన్ని పోలీసుస్టేషన్‌లోనే భద్రపరిచిన అధికారులు మంగళవారం ఉదయం హయత్‌నగర్‌లోని వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్ ఆనంద్‌రెడ్డి ద్వారా పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు.

తలపై దెబ్బ తగలడం వల్లే కుక్క మరణించిందని వైద్యులు ధ్రువీకరించినట్లు ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు. అయితే దానికి ర్యాబిస్ వ్యాధి ఉందా? లేదా? దానికి పిచ్చిపట్టిందా? లేదా? అనేవి నిర్ధారించడం కోసం మెదడు నుంచి ఓ పొరను సేకరించిన వైద్యులు దాన్ని విశ్లేషణ నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. ‘పోస్టుమార్టం అనంతరం శునక కళేబరాన్ని ఖననం చేస్తామని కోరడంతో జంతు పరిరక్షణ బృందానికే అప్పగించాం. వెంకటేశం, మల్లేష్‌లపై నమోదైన కేసు దర్యాప్తులో ఉంది. వెలుగులోకి వచ్చిన వివరాలు, నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు