ఆకాశ వీధి నుంచి హైదరాబాద్ అందాలు

1 Mar, 2016 08:10 IST|Sakshi
ఆకాశ వీధి నుంచి హైదరాబాద్ అందాలు

♦ నేటి నుంచి నగరంలో హెలికాప్టర్ రైడ్స్..
♦ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
 
సాక్షి, హైదరాబాద్ : అంతెత్తున ఠీవిగా నిలిచిన చార్మినార్.. గొప్ప కోటల్లో ఒకటిగా ఖ్యాతి పొందిన గోల్కొండ.. మానవ నిర్మిత పెద్ద జలాశయాల జాబితాలో మనకూ చోటు కల్పించిన హుస్సేన్‌సాగర్.. పాలరాతి అద్భుతం బిర్లా మందిర్.. చారిత్రక ఖ్యాతితోపాటు ఆధునిక హంగులద్దుకున్న భాగ్యనగరం.. ఇందులో ఏదీ మనకు కొత్తకాదు.. కానీ గగనతలం నుంచి వీటిని వీక్షిస్తే.. రోజూ చూసే నగరం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడా అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పిస్తోంది. హెలి టూరిజం జాయ్ రైడ్స్ ప్రాజెక్టును ఇటీవల మేడారం జాతర సందర్భంగా ప్రారంభించిన ప్రభుత్వం.. అందులో భాగంగా హైదరాబాద్ ఏరియల్ ట్రిప్‌ను మంగళవారం నుంచి ప్రారంభిస్తోంది.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సేవలు మొదలుకానున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం 10 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవే ట్ లిమిటెడ్‌తో కలసి పర్యాటక శాఖ ‘హెలి టూరిజం ఇన్ హైదరాబాద్’ను నిర్వహిస్తోంది. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఉండే జాయ్ రైడ్‌కు రూ.3500గా టికెట్ ధర నిర్ణయించారు. దీనికి స్పందన లభిస్తే ట్రిప్పు నిడివి పెంచుతూ నగర సమీపంలోని ఇతర ప్రాంతాల వరకు విస్తరించాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్, వరంగల్, కరీంనగర్, నల్లమల అడవి, కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాలు తదితరాలతో దీన్ని అనుసంధానించాలని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు