మహానగరం.. ఇల్లు పటిష్టం!

29 Dec, 2016 00:41 IST|Sakshi
మహానగరం.. ఇల్లు పటిష్టం!

జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

- పట్టణ ప్రణాళిక ట్రిబ్యునల్‌ను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- సభ్యులుగా జిల్లాస్థాయి రిటైర్డ్‌ జడ్జి, రిటైర్డ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
- హైదరాబాద్‌ మహానగరం మొత్తానికీ ఒకే మాస్టర్‌ ప్లాన్‌: కేటీఆర్‌
- మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం
- దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో అక్రమ గృహ నిర్మాణాలను నిరోధించి.. ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళిక (టౌన్‌ ప్లానింగ్‌) ట్రిబ్యునల్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగర పురపాలక కార్పొరేషన్‌ చట్టాన్ని సవరించింది. దీనికి సంబంధించి బుధవారం శాసనసభలో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణ అనుమతుల్లో న్యాయపరమైన సమస్యలను పట్టణ ప్రణాళిక ట్రిబ్యునల్‌ పరిష్కరిస్తుంది.

సాంకేతిక నిపుణులతో..
భవిష్యత్తులో ఖాజాగూడ లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని.. ఇకపై భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు సరళంగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా ఉంటాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జిల్లా స్థాయి రిటైర్డ్‌ జడ్జి, టౌన్‌ ప్లానింగ్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన సాంకేతిక నిపుణులు ట్రిబ్యునల్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ ట్రిబ్యునల్‌ అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే నియంత్రిస్తుందని, అలాగే భవన నిర్మాణంలో ఉన్న న్యాయపరమైన చిక్కులను సత్వరం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు భవన నిర్మాణ అనుమతి ఇస్తారని కేటీఆర్‌ వెల్లడించారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఖాళీలు భర్తీ చేస్తున్నామని.. ఇప్పటికే 120 పోస్టులు భర్తీ చేశామని, మరో 89 పోస్టుల కోసం నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

స్లమ్‌ రహిత నగరంగా..
హైదరాబాద్‌లో 1,400 మురికివాడలు ఉన్నాయని.. వీటిల్లో 20 గజాలు.. 50, 80, 100 గజాల్లో ఇళ్లు కట్టుకుని నివాసముంటున్న వారు ఉన్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అలాంటి ఇరుకైన ఇళ్లలో ఉంటున్న వారందరినీ ఒప్పించి... వారి స్థలాల్లోనే అపార్టుమెంట్లు కట్టించే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు వారి నియోజ కవర్గాల పరిధిలోని మురికివాడల ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. ఐడీఎస్‌ కాలనీలో 5 బస్తీలను తొలగించి 40 ఇళ్లున్న అపార్టుమెంట్లు కట్టించిన విషయాన్ని కేటీఆర్‌ ఉదహరించారు.

ఒకే మాస్టర్‌ ప్లాన్‌..
హైదరాబాద్‌ నగరంలోని ఐదు మాస్టర్‌ ప్లాన్లను మార్చేసి ఒకే మాస్టర్‌ ప్లాన్‌గా రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో జరగబోయే సమావేశంలో మాస్టర్‌ ప్లాన్‌ను ఎమ్మెల్యేలకు ప్రదర్శిస్తామని.. దానిపై సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోకుండా నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానా విధిస్తారని... ఆయా చోట్ల భూమి విలువకు 200 శాతం నుంచి 600 శాతం వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. కేటీఆర్‌ మాట్లాడడానికి ముందు బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్‌. జి.కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు