విద్యుదా"ఘాతుకం"

17 Aug, 2017 02:40 IST|Sakshi
విద్యుదా"ఘాతుకం"

పంట చేలల్లో యమపాశాలు..కరెంట్‌ తీగలకు బలవుతున్న రైతన్నలు
రాష్ట్రంలో ఏటా 300 మందికిపైగా మృత్యువాత
తెగిపడే తీగలు, విరిగిపోయే కండక్టర్లు, నాసిరకం పరికరాలు
క్షేత్రస్థాయిలో పట్టించుకోని కరెంటు సిబ్బంది
దిద్దుబాటు చర్యలు చేపట్టని విద్యుత్‌ పంపిణీ సంస్థలు
కుటుంబ పెద్దను కోల్పోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబాలు


సాక్షి, హైదరాబాద్‌: గొల్ల రమేశ్‌.. 23 ఏళ్లు.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారం.. తండ్రి పదేళ్ల కిందటే పాముకాటుతో చనిపోవడంతో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు.. రెక్కలుముక్కలు చేసుకుంటూ చెల్లి, తమ్ముడ్ని చదివిస్తున్నాడు.. జూలై 25న పత్తి చేనులో మందు పిచికారీ చేసేందుకు కూలీగా వెళ్లాడు.. చేనులో విద్యుత్‌ స్తంభం విరిగిపడటంతో తీగలు నేలకు అత్యంత సమీపంలో ఉన్నాయి.. అది గమనించని రమేశ్‌ అటుగా వెళ్లి విద్యుత్‌ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు! విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైంది!!

...ఇలా రమేశ్‌ ఒక్కడే కాదు.. ఏటా వందల మంది అన్నదాతలు చనిపోతున్నారు. పొలాల్లో తెగిపడుతున్న విద్యుత్‌ తీగలు యమపాశాలై రైతన్నలను కాటేస్తున్నాయి. స్తంభాలపై నాణ్యత లేని విద్యుత్‌ నిరోధకాలు(కండక్టర్లు) ఉన్నట్లుండి విరిగిపోతుండటం.. తక్కువ ఎత్తులో లోటెన్షన్‌ లైన్లు వేలాడుతుండటం.. రక్షణ ప్రమాణాలను పాటించకపోవడం.. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం నాసిరకం పరికరాలను వినియోగించడం.. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో దిక్కులేక రైతులే ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు జరుపుతుండటం.. ఇలా అనేక కారణాలతో రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏటేటా 300 మందికి పైగా రైతులు కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.    

ఎన్నాళ్లీ మృత్యుగోస?

డిస్కంల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది.. ‘వ్యవసాయానికి ఉచితంగానే విద్యుత్‌ ఇస్తున్నాం కదా..’అన్న చులకన భావంతో వ్యవహరిస్తున్నారు. ఏటా వర్షాకాలానికి ముందే వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో పంట పొలాల్లో విద్యుదాఘాతాలతో రైతన్నలు బలికావడం నిత్యకృత్యంగా మారింది. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను ప్రభుత్వం 7 గంటల నుంచి 9 గంటలకు పెంచింది. అది కూడా పగటి పూటే అందిస్తోంది. వచ్చే రబీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రాత్రి వేళల్లో వ్యవసాయ విద్యుత్‌ సరఫరా ఉండటంతో కారుచీకట్లో పంటలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌ ప్రమాదాలకు గురై రైతులు మృతి చెందేవారు. ఏడాదిగా పగటిపూటే కరెంట్‌ సరఫరా జరుగుతున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం.. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో గడిచిన ఐదేళ్లలో 650 మందికి పైగా రైతులు విద్యుదాఘాతాలకు బలయ్యారు. ప్రభుత్వం గుర్తించని మరణాలు కలిపితే ఈ సంఖ్య వెయ్యికి మించి ఉంటుంది. ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌) పరిధిలోని 5 జిల్లాల్లో ఐదేళ్ల కాలంలో వెయ్యి మంది రైతులు కరెంట్‌ షాక్‌తో మరణించినట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి.

మరమ్మతులు చేసేవారేరీ?
గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది విద్యుత్‌ స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు చేయడం దాదాపు మానేశారు. గ్రామాల్లో మరమ్మతు పనుల కోసం లైన్‌మెన్లు అనధికారికంగా ఓ ప్రైవేటు సహాయకుడిని నియమించుకుని బాధ్యతలను అతడికి అప్పగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాల తీవ్రత పెరిగిపోతోంది. విద్యుత్‌ సిబ్బంది ముఖం చాటేయడంతో రైతులు, గ్రామస్తులు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు ఎక్కి మరమ్మతు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలపై శవాలై వేలాడుతున్నారు.

మరణాలకు కారణాలివీ..
సబ్‌స్టేషన్ల నుంచి ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ సరఫరా చేసే లైన్లలో ఫేజ్‌తోపాటు న్యూట్రియల్‌ లైన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు ఈఆర్‌సీ ఆదేశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు డిస్కంలు ‘న్యూట్రియల్‌ లైన్‌’లాగడం మానేశాయి. ప్రత్యామ్నాయంగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్దే ‘ఎర్తింగ్‌’ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే రాష్ట్రంలో అత్యధిక విద్యుదాఘాతాలకు కారణమవుతోంది. ఎర్తింగ్‌ లోపాలు, నిర్వహణ సరిగా లేకపోవడంతో ‘ఊరంతటికీ షాక్‌’ కొడు తున్న ఘటనలు కూడా పదేపదే పునరావృతమవుతున్నాయి. పొలాలకు సమీపంలో లైన్లు లేకపోవడంతో రైతులు సొంత డబ్బులతో కట్టె స్తంభాలపై లైన్లు వేసుకుని కనెక్షన్లు తీసుకుంటున్నారు. గాలివానకు ఈ కట్టెలు విరిగి తీగలు నేలపై పడిపోతున్నాయి. రాత్రిపూట రైతులు వాటిని తొక్కడంతో కూడా మరణాలు చోటుచేసుకుంటున్నాయి.


పరిహారానికి కొర్రీలు ఎన్నో..!
విద్యుత్‌ శాఖేతర వ్యక్తులు, కాంట్రాక్టు కార్మికులు కరెంట్‌ షాక్‌తో మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రెండేళ్ల కింద విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) డిస్కంలను ఆదేశించింది. దక్షిణ డిస్కం పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఐదేళ్లలో 550 మంది రైతులు మృత్యువాత పడితే కేవలం 120 కుటుంబాలకే పరిహారం అందింది. దరఖాస్తుతో పాటు పంచనామా, పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఐఆర్, లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ ఇతర త్రా పత్రాలు జత చేయాలనే నిబంధన వల్లే మృతుల కుటుంబాలు పరిహారానికి నోచుకోవడం లేదు. ఈ పత్రాలు జారీ చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులూ సహకరించడం లేదు.

మరిన్ని వార్తలు