అడవిలో విద్యార్థి ఆత్మహత్య!

15 May, 2017 02:44 IST|Sakshi
అడవిలో విద్యార్థి ఆత్మహత్య!

15 రోజుల తరువాత వెలుగు చూసిన ఘటన

హైదరాబాద్‌: ఇంటర్‌ తప్పడంతో ఓ విద్యార్థి తీవ్ర మనోవేదనకు గురై అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. శామీర్‌పేట్‌ మండలం దేవరయాంజాల్‌కు చెందిన మనాస్‌(17) అల్వాల్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల వచ్చిన ఇంటర్‌ ఫలితాల్లో మనాస్‌తో పాటు అతని స్నేహితుడూ ఫెయిలయ్యాడు. బొల్లారంనకు చెందిన ఆ స్నేహితుడు కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన మనాస్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా ఆదివారం శామీర్‌పేట్‌ మండల పోతాయిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన స్థానికులు ఓ చెట్టుకు విగత జీవిగా ఉన్న ఆకారాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శామీర్‌పేట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటన సుమారు 15 రోజుల క్రితం జరిగి ఉంటుందని భావించిన పోలీసులు.. అతన్ని మనాస్‌గా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఇంటర్‌లో ఫేయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 15 రోజులుగా కన్పించకుండా పోయిన మనాస్‌.. మృతదేహమై తేలడంతో కుటుంబీకులు బోరున విలపించారు.

మరిన్ని వార్తలు