మద్దతు ధరలపై అధ్యయనం: హరీశ్‌

8 Jan, 2018 02:21 IST|Sakshi

ఐదు రాష్ట్రాల్లో మార్కెటింగ్‌ అధికారుల పర్యటన

13 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: మార్కెటింగ్‌ ఉన్నతాధికారుల బృందం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలలో పర్యటించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆయా రాష్ట్రాలలో వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలకు అక్కడి ప్రభుత్వాల నుంచి లభిస్తున్న కనీస మద్దతు ధరలపై అధ్యయనం చేయాలని సూచించారు. పంటల దిగుబడి, వాటి కొనుగోలు, విధివిధానాలు, అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను పరిశీలించాలన్నారు.

రాష్ట్ర రైతులకు మేలు జరిగేలా కొత్త విధానాలను ప్రవేశపెట్టేందుకు ఈ నెల 13 లోగా నివేదికలివ్వాలని ఆదేశించారు. ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని అన్ని మిల్లుల వివరాలు, వాటి మిల్లింగ్‌ సామర్థ్యం, ఆయా ప్రదేశాల్లో అంచనా వేసిన వివిధ పంటల ఉత్పత్తులు తదితర వివరాలను ఈ నెల 13 లోగా సంబంధిత జిల్లా మార్కెటింగ్‌ అధికారులు ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. మన కూరగాయల విక్రయ కేంద్రాలను జీహెచ్‌ఎంసీ సమీకృత మార్కెట్లలో, అనువైన మెట్రో రైల్వేస్టేషన్లలో త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 330 నాబార్డు గోదాముల్లో మిగిలిన 18 గోదాముల నిర్మాణం ఈ మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.

నేడు ‘తుమ్మిళ్ల’కు శంకుస్థాపన
రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్‌) కింది ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు జలాలు అందించనుంది. తుంగభద్ర జలాల వాటాను వినియోగంలోకి తెచ్చేలా తలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా