కౌంటర్ దాఖలు చేయండి

2 Sep, 2016 02:03 IST|Sakshi
కౌంటర్ దాఖలు చేయండి

వీణావాణి వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను వేరు చేసే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వీణావాణిలను వేరు చేసే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసింది. దీనిని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం రెండు రోజుల క్రితం విచారించింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వీణావాణిలు ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఉన్నారని, వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని మరోచోట లేదా వారి సొంతూరు వరంగల్‌లో అనువైన చోట ఉంచి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతేకాక వారి పోషణ నిమిత్తం నెలకు రూ.15 వేలు చెల్లించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ సంస్థతో ప్రత్యేకంగా సమావేశమై ఓ నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిం చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు