యువతితో చనువుగా ఉంటున్నాడని..

20 Sep, 2016 02:40 IST|Sakshi
యువతితో చనువుగా ఉంటున్నాడని..

హైదరాబాద్: పక్కింటి యువతితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో భవానీ మాల తీయించి మరీ ఓ పురోహితుడిని స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు చితకబాదారు. ఆ అవమానాన్ని భరించలేక అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పేట్‌బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పద్మానగర్ ఫేజ్-02 నారాయణ క్షేత్రంలో ఉండే శ్రీనివాసాచార్యులు కుమారుడు భాస్కరకృష్ణ స్వరూప్  (భాస్కరాచార్యులు) పౌరోహిత్యం చేసి జీవిస్తున్నాడు. 25 ఏళ్ల స్వరూప్‌ను ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళతో చనువుగా ఉండడం చూసిన ఆమె భర్త... కొత్తగా ఎన్నికై న పద్మానగర్ ఫేజ్-2 వెస్ట్ సంక్షేమ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో ఆదివారం పలుమార్లు స్వరూప్, అతడి తండ్రిని పిలిచి సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. సోమవారం మరోమారు పిలిచిన ప్రతి నిధులు... స్వరూప్ ధరించిన భవానీ మాలను బలవంతంగా తీయించి ఒక్కసారిగా మీదపడి చితకబాదారు. తండ్రి శ్రీనివాసాచార్యులు వారి కాళ్లు పట్టుకుని వద్దని వేడుకున్నా... పట్టించుకోలేదు. గాయాలతో అక్కడి నుంచి సారుుబాబా ఆలయానికి వెళ్లి హారతి ఇచ్చి ఇంటికి వచ్చిన స్వరూప్... తీవ్ర మనస్తాపానికి గురై చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంక్షేమ సంఘం ప్రతినిధులు హెచ్చరించాల్సిందిపోయి ఇలా విచక్షణారహితంగా కొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సంఘం ప్రతినిధులు పరారయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సంక్షేమ సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్‌రాజు, కృష్ణంనాయుడు, సంజీవయ్య, రామకృష్ణ, సత్యనారాయణ, రాంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు