ఆట..‘పాట’శాలలు!

27 Mar, 2016 01:12 IST|Sakshi
ఆట..‘పాట’శాలలు!

ముగిసిన వార్షిక పరీక్షలు
సర్కారు బడుల్లో ఆటలు, పాటలతో కాలక్షేపం
పుస్తకాలు లేకుండా ‘కొత్త’ పాఠాలు చెప్పాలట
అయోమయంలో ఉపాధ్యాయులు
‘ఒంటిపూట బడి’కి సగం మంది విద్యార్థుల డుమ్మా
‘సాక్షి’ క్షే త్ర స్థాయి పరిశీలనలో వెల్లడి

 సాక్షి, సిటీబ్యూరో: విద్యా శాఖ వింత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఆటపాటలకు వేదికలుగా మారాయి. వార్షిక పరీక్షలు ముగియడంతో.. ప్రస్తుతం ఏం చేయాలో ఉపాధ్యాయులకు పాలుపోవడం లేదు. దీంతో విద్యార్థులంతా ఆటలు, పాటలతో కాలం గడుపుతున్నారు. పేరుకు పాఠశాలకు హాజరవుతున్నా.. నేర్చుకుంటున్నది మాత్రం శూన్యమనే చెప్పవచ్చు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత  పాఠశాలల్లో నెలకొన్న ఈ దుస్థితి ‘సాక్షి’ శనివారం నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది.

 ఇదీ పరిస్థితి..
కేంద్ర ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగా.. నూతన విద్యా సంవత్సరాన్ని రాష్ట్రంలో మార్చిలోనే మొదలు పెట్టాలని ప్రభుత్వం  భావించింది.   గతం కంటే ముందుగానే 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను నిర్వహించారు. చివరకు ప్రభుత్వం  నిర్ణయాన్ని మార్చుకుంటూ.. పాత పద్ధతిలోనే నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అరకొరగా తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ఏం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు.

కనీసం ప్రాథమికాంశాలు చెబుదామన్నా పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం బోధించాలని టీచర్లు సంశయంలో పడ్డారు. విద్యార్థులు పాఠశాలలో ఆటపాటలకే కేటాయిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. గత ఏడాది చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రధానోపాధ్యాయులకు జంట జిల్లాల డీఈఓలు సూచించినట్లు సమచారం. చదవడం, రాయడం, పునశ్చరణపై దృష్టి సారించాల్సిందిగా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక తరగతిలో వెనుకబడిన విద్యార్థులను మినహాయిస్తే.. చురుకైన వారికేం బోధించాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

పది విద్యార్థులకు నష్టమే...
పదో తరగతిలో అడుగు పెడుతున్నవిద్యార్థులది మరింత గందరగోళ పరిస్థితి. వీరికి కొత్త పాఠ్య పుస్తకాలు రాలేదు. పాతవీ అందే వీల్లేదు. ప్రస్తుతం టెన్‌‌త పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవి ముగిస్తేనే పాత పుస్తకాలు  పంపిణీ చేయొచ్చు. దీనికోసం ఏప్రిల్ మొదటి వారం వరకు ఆగాల్సిందే. ఈలోగా ఒంటి పూట బడులు సగం పూర్తవుతాయి. బేసిక్స్ నేర్చుకునే అవకాశానికి విద్యార్థులు దూరమవుతున్నారు.

 హాజరు అంతంతే...
ఇప్పటి వరకు వార్షిక పరీక్షలు ముగియగానే.. వేసవి సెలవులు ఉండేవి. ఈ సారి పరీక్షలు పూర్తయ్యాక.. ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో సగం మంది మాత్రమే వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. మరోపక్క ఎండలు తీవ్రం కావడంతో కొందరు పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఉపాధ్యాయుల హాజరు తీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఎస్సెస్సీ పరీక్షలకు చాలా మంది టీచర్లు ఇన్విజిలేటర్లుగా వెళ్తున్నారు. మరికొందరు సెలవులపై వెళ్లగా.. ఇంకొందరు డెప్యుటేషన్‌లో ఉన్నారు. మిగిలిన కొద్ది మంది మాత్రమే బడులకు వెళ్తున్నారు.

బేసిక్స్ చెప్పాలని ఆదేశించాం
పై తరగతులకు సంబంధించిన బేసిక్స్ చెప్పేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించాం.  వెనుకబడిన వారిని గుర్తించి..ప్రత్యేక దృష్టి సారించాలని సూచించాం.   విద్యార్థులంతా తరగతులకు వచ్చేలా చూడాల్సింది ఉపాధ్యాయులే.
- సోమిరెడ్డి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి

తిరుమలగిరి మండలంలో...
రసూల్‌పురా: కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలోని మడ్‌ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభమెనప్పటికీ విద్యార్థుల సంఖ్యను వేళ్లమీద లెక్కించవచ్చు. ఈ పాఠశాల్లో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో విద్యార్థులంతా పరీక్షలు పూర్తికాగానే వారి స్వగ్రామాలకు వెళ్లారు. కేవలం స్థానిక విద్యార్థులే హాజరవుతున్నారు. 8వ తరగతి తెలుగు మీడియంలో 10 మంది బాలికలుండగా ఒక్కరు కూడా హాజరు కాలేదు. 9వ తరగతి తెలుగు మీడియం బీ సెక్షన్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక మాత్రమే హాజరయ్యారు. 6నుంచి 10 తరగతి వరకు 28 మంది ఉపాధ్యాయులు ఉండగా 8 మంది మాత్రమే హాజరవుతున్నారు. మిగిలిన 20 మంది టెన్‌‌త పరీక్షలకు ఇన్విజిలేటర్లు. 7వ తరగతి నాలుగు సెక్షన్లలోమొత్తం విద్యార్థులు 118మంది.  బాలురు 42 మందికి 19 మంది, బాలికలు 38 మందికి గాను 12 మంది మాత్రమే హాజరయ్యారు.

పుస్తకాలు రాలేదు...
ప్రభుత్వం నుంచి  పుస్తకాలు రాలేదు. 9 నుంచి10వ తరగతికి వెళ్లిన విద్యార్థుల పుస్తకాలు తీసుకుని తరగతులకు వస్తున్నాం. సెలవులు ఇవ్వకుండా తరగతులు ప్రారంభించడంతో ఒత్తిడి పెరుగుతోంది. త్వరగా కొత్త పుస్తకాలు ఇవ్వాలి. -దుర్గా ప్రసాద్, 9 వతరగతి

 అల్వాల్‌లో...
అల్వాల్: అల్వాల్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఉదయం పదోతరగతి పరీక్షలు ఉండడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు తరగతులు ప్రారంభమయ్యాయి. పది మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో ఏడుగురు పరీక్ష విధులకు హాజరవుతున్నారు. మిగతా ముగ్గురు 6 నుంచి తొమ్మిదో తరగతి వరకుభోదిస్తున్నారు. పాత పుస్తకాలనే విద్యార్థులు మార్పిడి చేసుకుని చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు నూతనంగా ఏ సబ్జెక్ట్‌లో పాఠాలు మొదలు కాలేదు. విద్యార్థుల హాజరు శాతం 60కి పైగా ఉంది.

మల్కాజిగిరిలో...
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి 8వ తరగతి విద్యార్థులకు త్రీఆర్స్ విధానం ద్వారా తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులు బోధిస్తున్నారు. 9వ తరగతి (వచ్చే ఏడాది 10వ తరగతి) విద్యార్థులకు చతుర్విధ బోధనా ప్రక్రియలో భాగంగా కూడికలు, తీసివేతలు, గుణాంకాలు, భాగాహారాలను అదనంగా నేర్పిస్తున్నారు. సీనియర్ల పుస్తకాలను జూనియర్లకు ఇస్తున్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

శాలిబండలో...
యాకుత్‌పురా: లలితాబాగ్ రోడ్డులోని శాలిబండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 145 మంది విద్యార్థులకు గాను... 102 మంది హాజరయ్యారు. పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా... నలుగురు పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వెళ్లారు. అందుబాటులో ఉన్న నలుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.

 పాత పుస్తకాలతో...
తరగతులు మారిన విద్యార్థులకు పాత పుస్తకాలతో బోధిస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఏడో తరగతి మారిన విద్యార్థులకు పాత విద్యార్థుల పుస్తకాలను సేకరించి వాటి ద్వారా పాఠాలు చెబుతున్నాం.  - మైత్రి, ఇన్‌చార్జి హెచ్‌ఎం, శాలిబండ బాలికల ఉన్నత పాఠశాల

మణికొండలో...
మణికొండ: ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో వారు పాఠశాలలకు వచ్చేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. మణికొండ ఉన్నత పాఠశాలలో 537 మంది విద్యార్థులకు గాను కేవలం 257 మంది మాత్రమే హాజరయ్యారు.

 ప్రభుత్వ ఆదేశాలు ఇవీ...
గత ఏడాది వెనుకబడిన విద్యార్థులను ఒంటిపూట బడుల్లో మరింత బోధించి వారిని మొదటి శ్రేణి విద్యార్థులుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే భాషా సిలబస్‌లో  రీడింగ్, రైటింగ్, రివిజనింగ్  అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు.  లెక్కల సబ్జెక్టుకు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు నేర్పించాలని నిర్ణయించారు. వెనకబడిన విద్యార్థులు పాఠశాలలకు రాకపోవటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండాపోతోందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

రామాంతాపూర్‌లో...
రామంతాపూర్:  స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రాకపోవడంతో విద్యార్థులకు కేవలం బేసిక్స్ మాత్రమే నేర్పిస్తున్నారు. అదేవిధంగా 400 మంది విద్యార్థులకు గాను 180 మంది మాత్రమే హాజరవుతున్నారు. 22 మంది ఉపాధ్యాయులకు కేవలం ముగ్గురు మాత్రమే వస్తున్నారు. అన్ని తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు.

 ఎండతో అవస్థలు
అన్ని తరగతుల విద్యార్థులను ఒకే తరగతిలో కూర్చోబెట్టి బేసిక్స్ నేర్పిస్తున్నారు. ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్న సమయంలో ఎండకు తాళలేక ఇబ్బందులకు గురవుతున్నాం. కొంత మందికి జ్వరాలు వస్తున్నాయి.  - పూజ, 9వ తరగతి విద్యార్థిని

నల్లగుట్టలో...
రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్‌లోని నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థుల సంఖ్య పలుచగా కనిపించింది. 10 మంది ఉపాధ్యాయులు 10వ తరగతి పరీక్షల విధులకు వెళ్లడంతో వీరికి బోధించే వారే కరువయ్యారు. కొంత మంది విద్యార్థుల నుంచి గత ఏడాది పుస్తకాలు సేకరించినా  ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. 9 నుంచి 10వ తరగతికి వెళుతున్న వారికి టెన్త్ పరీక్షలు పరీక్షలు పూర్తయిన తర్వాతే పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తక్కువగా  హాజరవుతున్నారు. 

కవాడిగూడలో...
కవాడిగూడ: కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలోని 20 మంది ఉపాధ్యాయులలో 15 మంది ఎస్సెస్సీ పరీక్షల విధుల్లో ఉన్నారు. ఇతర విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిసిన కారణంగా చాలా వరకూ పాఠశాలకు రావడం లేదు. 30 శాతమే వస్తున్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలోనూ ఇదే తీరు. విద్యార్థులు చాలా వరకూ రావడం లేదు. ఉపాధ్యాయులేమో పదో తరగతి పరీక్షల డ్యూటీలో ఉన్నారు. కొత్త తరగతులకు సంబంధించిన పుస్తకాలు అందనందున విద్యార్థులకు లెటర్ రైటింగ్, జనరల్ టాపిక్స్, గ్రామర్, మ్యాప్ పాయింటింగ్, సైన్స్ డయోగ్రామ్స్ వంటివి బోధిస్తున్నారు.

 హైదర్‌గూడలో...
హిమాయత్‌నగర్: హైదర్‌గూడలోని గవర్నమెంట్ సెయింట్‌పీటర్స్ హైస్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 172 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 19 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. మిగతా 151 మందిలో కొంతమందే వస్తున్నారు.

జగద్గిరి గుట్టలో...
జగద్గిరిగుట్ట/చింతల్: జగద్గిరిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కొందరు మైదానంలో.. మరికొంత మంది వరండాల్లో ఆడుకుంటున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వార్షిక పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే పనిలో పడి స్టాఫ్ రూమ్‌లకు పరిమితమయ్యారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు 828 మంది ఉండగా... శనివారం కేవలం 482 మంది మాత్రమే హాజరయ్యారు. 

 చింతల్ భగత్‌సింగ్ నగర్‌లో...
చింతల్ భగత్‌సింగ్‌నగర్  ఉన్నత పాఠశాలలో పదో తరగతి వారిని మినహాయిస్తే మొత్తం 100 మంది విద్యార్థులు ఉండగా.. 70 మంది హాజరయ్యారు. హెచ్‌ఎంతో కలిపి 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో నలుగురు హాజరు కాగా... ఇద్దరు గైర్హాజరయ్యారు. మరో ముగ్గురు పరీక్షల విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలకు నాలుగు రోజుల క్రితం కొత్త పుస్తకాలు వచ్చాయి. విద్యార్థులు తక్కువగా హాజరు కావడంతో వాటిని పంపిణీ చేయలేదు. పిల్లలు ఆటపాటలతో కాలక్షే పం చేస్తున్నారు.

 గురుమూర్తినగర్‌లో..
రంగారెడ్డినగర్ డివిజన్ గురుమూర్తినగర్  హైస్కూల్‌లో పదో తరగతి వారిని మినహాయిస్తే 214 మంది విద్యార్థులున్నారు. వీరిలో 117 మంది హాజరయ్యారు. 15 మంది ఉపాధ్యాయులకు 14 మంది హాజరయ్యారు. కొత్త పుస్తకాలను సోమవారం పంపిణీ చేస్తామని హెచ్‌ఎం సుదర్శన్ తెలిపారు.

మరిన్ని వార్తలు