సునీత కృష్ణన్ కారుపై దాడి

7 Feb, 2015 07:07 IST|Sakshi
సునీత కృష్ణన్ కారుపై దాడి

హైదరాబాద్: వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల పునరావాసానికి కృషిచేస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ కారుపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఆమె అందులో లేరు. చార్మినార్ సమీపంలోని సంస్థ కార్యాలయం సమీపంలో కారు పార్క్ చేసి ఉండగా ఈ ఘటన జరిగింది. సునీత కృష్ణన్ కారుపై దాడి జరగడం, మూడు రోజులుగా ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తుండడంపై జాతీయ మీడియాలోనూ కథనాలు రావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.

ఓ జాతీయ చానెల్‌కు ఆమె ఇంటర్వూ ఇచ్చిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓ గ్యాంగ్‌రేప్‌నకు సంబంధించి నిందితుల వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్లే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 6 నెలల క్రితం ఉత్తరాది రాష్ట్రంలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన వీడియో వాట్సాప్ ద్వారా సునీత కృష్ణన్‌కు చేరింది. ఆ యువకులు మాత్రమే కనిపించే విధంగా ఆమె ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఆ దుశ్చర్యపై ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయమే సునీత కృష్ణన్‌ను ఓ జాతీయ చానల్ ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసింది. ఆ తర్వాత గంట సేపటికే ఆమె కారును దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఆరా తీశారు. మరోవైపు శుక్రవారం సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చార్మినార్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సునీత కృష్ణన్ ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తునకు రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజ్వల కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మూడు రోజులుగా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సునీత కృష్ణన్ మీడియాకు వెల్లడించారు. లైంగికదాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. లైంగికదాడుల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తేవాలన్నారు. తాజా ఘటనపై హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు