‘సూపర్‌’ 30..!

12 Jun, 2017 01:43 IST|Sakshi
‘సూపర్‌’ 30..!
- ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 30 మందికి 30 మంది అర్హత 
దేశవ్యాప్తంగా విస్తరిస్తాం: ఆనంద్‌ కుమార్‌
 
పట్నా: ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సూపర్‌ 30 మరోసారి సత్తా చాటింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని సూపర్‌ 30లోని మొత్తం 30 మంది విద్యార్థులకుగానూ 30 మంది అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. ‘‘ఈ ఏడాది ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 30 మందికి 30 మంది అర్హత సాధించడం సంతోషంగా ఉంది. సూపర్‌ 30ని విస్తరించేందుకు ఇప్పుడు సమయం వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఇకపై పరీక్షలు నిర్వహిస్తాం. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం’’ అని సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్‌ ప్రకటించారు. ఐఐటీ జేఈఈ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

విద్యార్థుల కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష సూపర్‌ 30 విజయానికి కారణమని చెప్పారు. ఆనంద్‌కుమార్‌ సూపర్‌ 30 సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ అందజేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి ఉచితంగా ఆహారం, వసతి సదుపాయం కల్పిస్తోంది. సూపర్‌ 30 స్థాపించి ఇప్పటికి 15 ఏళ్లు పూర్తయ్యింది. మొత్తం 450 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే అందులో 396 మంది విద్యార్థులు ఐఐటీలకు ఎంపికయ్యారు. ఈసారి ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల్లోనూ స్ఫూర్తినిచ్చే గాథలు ఎన్నో ఉన్నాయి. సూపర్‌ 30లో చదివిన కెవ్లిన్‌ తండ్రి దీపక్‌కు ఉద్యోగం లేదు.

యోగా నేర్పుతుంటాడు. అయినా కుటుంబ పోషణకు తగ్గ ఆదాయం మాత్రం రావడం లేదు. అయితే పేదరికం నుంచి బయటపడాలంటే.. చదువే మార్గమని గుర్తించిన అతడు.. కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. పదేళ్ల క్రితం తాను సూపర్‌ 30 గురించి విన్నానని, తన కలను నిజం చేయడానికి తన కుమారుడు ఇక్కడికి రావాలని కోరుకున్నానని, ఇప్పుడు తన కుమారుడు నిజంగానే తన కల నిజం చేశాడంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు దీపక్‌. తన కల నిజం చేసినందుకు ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇతనిలాగే.. అర్బాజ్‌ ఆలమ్‌ కోడిగుడ్ల వ్యాపారి కొడుకు, అభిషేక్‌.. భూమి లేని నిరుపేద రైతు పుత్రుడు.. అర్జున్‌ రైతు కూలీ కుమారుడు.. పేదరికాన్ని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి.. తమలాంటి ఎందరికో ప్రేరణగా నిలిచారు. 
 
అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఐఐటీల్లో 58 మందికి సీట్లు 
సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠ శాలల నుంచి 58మంది విద్యార్థులు ప్రతిభ కనబ ర్చారని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 25 మంది విద్యార్థులు, గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి 33 విద్యార్థులు ఉన్నారన్నారు. వీరందరికీ ఐఐటీల్లో సీట్లు దక్కను న్నాయన్నారు. ఎస్టీ కేటగిరీలో దేవేంద్ర నాయక్‌ ఆలిండియా స్థాయిలో 167 ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో ఎం.కార్తీక్‌ 430 ర్యాంకు సాధించారన్నారు. ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రవీణ్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీఎస్‌ లాసెట్‌లోనూ గురుకుల విద్యార్థులు సత్తా చాటారన్నారు. 
మరిన్ని వార్తలు