రైతన్నకు ‘మద్దతు’!

22 Jan, 2018 01:32 IST|Sakshi

     ఎంఎస్‌పీ కన్నా తక్కువ పలికితే తేడా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి

     ప్రభుత్వానికి మార్కెటింగ్‌ శాఖ సిఫారసు

     నాలుగు రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించిన అధికార బృందాలు

     త్వరలో ఉన్నతస్థాయి సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: పంటకు మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర పలికితే ఆ తేడాను సర్కారే రైతుకు చెల్లించాలని మార్కెటింగ్‌ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు వ్యవసాయ మార్కెట్ల పనితీరు, రైతులకు అందుతున్న మద్దతు ధరలు, సేవలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు చెందిన నాలుగు అధికారుల బృందాలు హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చాయి. తాజాగా ఆ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాయి. మధ్యప్రదేశ్‌లో మద్దతు ధర కంటే తక్కువ పలికితే ఆ తేడాను ప్రభుత్వమే రైతులకు అందిస్తోంది. దీన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. హరియాణాలో అక్కడి ప్రభుత్వం ఇటీవలే కూరగాయలకు మధ్యప్రదేశ్‌ మాదిరిగా ఓ పథకానికి రూపకల్పన చేసింది. ఇక కర్ణాటకలో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ఆ నిధులతో రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నారు. అయితే కేంద్రం నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రెండేళ్లుగా అక్కడ సరైన ఫలితాలు రావడంలేదని కర్ణాటక వెళ్లొచ్చిన బృందం తన నివేదికలో తెలిపింది. మహారాష్ట్రలో 1971లోనే పత్తి ఫెడరేషన్‌ ఏర్పాటైంది. పత్తికి మద్దతు ధర అందించడం దీని ఉద్దేశం. అయితే దాని గుత్తాధిపత్యం కారణంగా మూసేసినా, ఇటీవల మళ్లీ అక్కడక్కడ కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీని ద్వారా మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేస్తున్నారు. 

ఏది ఆచరణీయం? 
మార్కెటింగ్‌ శాఖ బృందాలు ఇచ్చిన నివేదికపై త్వరలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. మద్దతు ధర, మార్కెట్‌ ధర మధ్య తేడాను రైతులకు ఇచ్చే సిఫారసుపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. దీన్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడనుంది. పైగా ప్రభుత్వం కూడా రైతులకు మద్దతు ధర అందించేందుకు రైతు సమితులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. వాటి ద్వారా కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

కేంద్ర పథకం ఎలా ఉంటుందో? 
కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మద్దతు ధర అందించేందుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వచ్చే బడ్జెట్‌లో దీన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఎఫ్‌సీఐ లేదా ఇతర సంస్థల ద్వారా వరి, గోధుమ పంటలను మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేసే విధానం ఉంది. అయితే సోయాబీన్, కంది, మినుములు, పెసలు, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న తదితర పంటలకు మాత్రం ఇది అమలు కావడం లేదు. ఆయా రాష్ట్రాల్లో పండించిన పంట దిగుబడిలో కేవలం 30 శాతం వరకు మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది సరికాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెబుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్‌ తదితర సంస్థలే ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేశాక వాటిని అమ్మే సందర్భంలో ఆయా రాష్ట్రాల సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టంలో కేంద్రం కేవలం 40 శాతమే భరిస్తానని చెబుతోంది. దాన్ని 55 శాతం చేయాలని రాష్ట్రం కోరుతోంది. అలాగే పంట ఉత్పత్తుల సేకరణకు అవసరమైన నిధులను కేంద్రమే సమకూర్చాలని డిమాండ్‌ చేస్తోంది. కనీసం 50 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ను సమకూర్చాలని విన్నవిస్తోంది. మార్కెటింగ్‌ బృందాల నివేదిక, కేంద్ర పథకం తీరు చూశాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేస్తుందన్న చర్చ జరుగుతోంది.  

మరిన్ని వార్తలు