పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కీలక ఆదేశాలు

26 Oct, 2016 15:15 IST|Sakshi
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కీలక ఆదేశాలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు చేసిన ఫిర్యాదులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నవంబర్ 8వ తేదీ లోగా చెప్పాలని తెలంగాణ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయమై తమకు ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ తాము ఇప్పటికే ఆ నోటీసులను పంపామని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ స్పీకర్‌ ఎంత గడువులోగా చర్యలు తీసుకుంటారో నవంబర్ 8వ తేదీలోగా స్పష్టం చేయాలని తెలిపింది. 
 
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ నవంబర్ 8లోగా తేల్చకపోతే మాత్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పష్టమైన గడువు విధిస్తుందని, అప్పటికీ ఏ విషయమూ తేలకపోతే సుప్రీంకోర్టే వారిపై అనర్హత వేటు వేయడం కూడా తప్పకపోవచ్చని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఫిరాయించిన నేపథ్యంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు రావడం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. 
 
మరోవైపు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అక్కడ సైతం వైఎస్ఆర్‌సీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదులను ఇంతవరకు పరిష్కరించకపోవడం తెలిసిందే. 
మరిన్ని వార్తలు