ఇద్దరు గవర్నర్‌లను డిస్మిస్ చేయాలి

21 Jul, 2016 04:16 IST|Sakshi
ఇద్దరు గవర్నర్‌లను డిస్మిస్ చేయాలి

 సురవరం డిమాండ్
 బీజేపీ దుర్మార్గాలపై పోరాడాలి
 దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలి

 
 సాక్షి, హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌లను కేంద్రప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసలు గవర్నర్ పదవే వృథా అని, కేంద్రానికి ఏజెంట్‌గా వ్యవహరించేందుకే ఆ పదవి పనికొస్తోందని అన్నారు. సంఘ్‌పరివార్‌కు అనుకూలంగా వ్యవహరించే వారిని గవర్నర్లుగా నియమిస్తుండడంతో వారు తమ పాతకాలం నాటి బూజుపట్టిన భావాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
 
 ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని సురవరం డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. బీజేపీ పాలనలో దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, విద్య, సాంస్కృతిక, సామాజిక రంగాలపై దాడి జరుగుతోందని విమర్శించారు. ఈ దాడులకు నిరసనగా లెఫ్ట్, రాజకీయేతర సంస్థలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తమ జాతీయ సమితి పిలుపునిచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ సహా అన్ని వర్గాలు సమైక్యంగా ప్రతిఘటిస్తే తప్ప బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కొనలేమని ఆయన పేర్కొన్నారు.  
 
 గాంధీజీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలు..
 మహాత్మాగాంధీ హత్యకు గురికావడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందో లేదో తెలియదు కానీ ఆయన మరణం తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలు జరుపుకుందని  సురవరం వ్యాఖ్యానించారు. ఈ విషయాన్నే ఆర్‌ఎస్‌ఎస్‌కు రాసిన లేఖలో వల్లభాయ్‌పటేల్ పేర్కొన్నారన్నారు. అంతేకాకుండా అప్పట్లో విజయవాడలో ఈ ఉత్సవాల విషయంలో సీపీఐ-ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగిందన్నారు.
 
 కశ్మీర్ పరిణామాలపై అఖిలపక్షాన్ని పిలవాలి..
 కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సురవరం డిమాండ్ చేశారు. బుర్హన్ అనే టైస్టు హతం కావడంపై వ్యాఖ్యానిస్తూ, గతంలో ఒక టైస్టు ఎన్‌కౌంటర్‌పై ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కాలేదన్నారు. దీంట్లో ఏదో తప్పు జరిగిందని (సమ్‌థింగ్ ఈజ్ రాంగ్) వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు