మిగులు సీట్ల భర్తీకి కసరత్తు

10 Sep, 2016 01:09 IST|Sakshi

- ఎన్‌ఐటీ, ఐఐటీల్లో మిగిలిన 3,172 సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ 
- సుప్రీం నుంచి అనుమతి పొందేలా ఎంహెచ్‌ఆర్‌డీ చర్యలు

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మిగిలిపోయిన 3,172 సీట్ల భర్తీకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ (జోసా) ద్వారా ఆరు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించినా ఇన్ని సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసేందుకు ఆలోచనలు చేస్తోంది.

అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31 కల్లా ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పూర్తి కావాలి. ప్రస్తుతం మిగిలిపోయిన ఆ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ చేపట్టాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇందుకు అనుమతి పొందాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు