రైతు అ‘సమగ్ర’ సర్వే

15 Aug, 2017 02:51 IST|Sakshi
రైతు అ‘సమగ్ర’ సర్వే

రెవెన్యూ రికార్డులకు.. సర్వే వివరాలకు భారీ తేడా

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన సర్వే వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదు. ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని శాఖ తేలిస్తే, 1,100 మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరి ప్రభుత్వ పెట్టుబడి ఎవరికివ్వాలి? చివరికి ఆ మొత్తం నిజమైన రైతులకు చేరకుండా పక్కదారి పడితే పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏ భూమి ఎవరిదో స్పష్టతకు రావాలి. ఇందుకు రెవెన్యూ స్పెషల్‌ డ్రైవ్‌ చేయాలి. గ్రామం యూనిట్‌గా సర్వే జరగాలి. ఎంత భూమి ఉంది? ఎవరి పేరిట మీద ఉందనే విషయంలో స్పష్టతకు రావాలి.’’

 ఇటీవలి సమీక్షలో రైతు సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్‌ పెదవి విరుపిది. ఆ సర్వేను ఆయన విశ్వసించడం లేదనేం దుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)తో నిర్వహించిన ఈ సర్వేపై తొలి నుంచీ ఆరోపణలున్నాయి. సమగ్రంగా జరగలేదని, పలుచోట్ల రైతుల ఇళ్లకు వెళ్లకుండానే రాసేశారని వచ్చిన విమర్శలు సీఎం దాకా వెళ్లాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి పథకం అమలుకు ఈ సర్వేను ఆధారం గా తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. రెవెన్యూ స్పెషల్‌ డ్రైవ్‌ జరిపి, సర్వే వివరాల ను ఆ సమాచారంతో సరిచూసుకొని ముందుకు పోతుందంటున్నారు.

30 లక్షల ఎకరాలు తగ్గాయి..!
సాగుభూమి, రైతుల సంఖ్యలో వ్యవసాయశాఖ లెక్కలకు, సర్వేలో బాగా తేడా లుండటంతో దాని సాధికారతపై సీఎంకు అనుమానం తలెత్తింది. రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్న భూమి వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 1.54 కోట్ల ఎకరాలు కాగా సర్వేలో 1.24 కోట్లే తేలింది. రైతుల సంఖ్య కూడా శాఖ వద్ద 55.53లక్షలుంటే çసర్వేలో 45.55లక్షలే తేలారు. ఉద్యాన పంటల విస్తీర్ణమూ 8లక్షలకు బదులు 3.59 లక్షలుగా తేలింది. కొత్త ఏఈవోలకు సమగ్ర శిక్షణ ఇవ్వకుండా సర్వే భారమంతా వారిపై వేసి అధికారులు చేతులు దులుపుకోవడమే దీనికి కారణమంటున్నారు. సకాలంలో ట్యాబ్‌లు ఇవ్వక పోవడంతో సర్వే వివరాలు రాయడానికే సమయం సరిపోయింది. దాంతో చాలాచోట్ల మొక్కుబడి సమాచారంతో సరిపుచ్చారన్న వాదనలున్నాయి. వివరాలను మళ్లీ సరిచూసి ట్యాబ్‌లో నిక్షిప్తం చేయాలని శాఖ ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు