దారుణం.. దయనీయం

11 Sep, 2015 14:38 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రమాదేవి.. అనాథ వికలాంగురాలు.. ఆపై నిండు గర్భిణి. వికలాంగుల పింఛనుకూ నోచుకోలేదు. ఈమె గత ఏడాది తనకు ఉపాధి కల్పించాలని సూర్యాపేటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరడంతో స్థానికంగా ఉన్న రాజీవ్ విద్యామిషన్ హాస్టల్‌లో వాచ్‌మెన్‌గా ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగం ఇప్పించారు. ఆ తరువాత హాస్టల్‌ను అక్కడి నుంచి దూరంగా తరలించడంతో ఉపాధి కోల్పోయింది.

తనకు లేదా.. తన భర్తకు ఏదైనా బతుకుదెరువు చూపాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆయన చుట్టూ ఉన్నవారు..సెక్యూరిటీ సిబ్బంది అవకాశం ఇవ్వలేదు. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలిసి తన సమస్య చెప్పుకుందామని గత వారం రోజులుగా తెలంగాణ సెక్రె టేరియట్ ఎదుట ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ పడిగాపులు కాస్తున్నా..అమాత్యుల దర్శనభాగ్యం దక్కలేదు.

గురువారం వర్షంలో తడుస్తున్న ఆమెను గమనించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తన కారులో ఎక్కించుకుని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన కూడా ఈమె సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. చివరకు పిడమర్తి రవి జోక్యం చేసుకుని కేటీఆర్ సార్ లేనందున మరోసారి రావాలని చెప్పి చేతి ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

 




-ఫొటోలు: అమర్
 

మరిన్ని వార్తలు