ప్రత్యేక హోదా గళాలపై వేటు?

24 Sep, 2016 01:33 IST|Sakshi
ప్రత్యేక హోదా గళాలపై వేటు?

- రంగం సిద్ధం చేస్తున్న సర్కారు
- అసెంబ్లీ కమిటీ హాల్లో హక్కుల కమిటీ భేటీ
- వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలపై చర్చ
- నోటీసులు జారీ చేసి వాదనలు వినాలని నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్/అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం శాసనసభ లోపల, వెలుపల నిరంతరం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. శుక్రవారం శాసనసభ హక్కుల కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(వైఎస్సార్‌సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్, బీసీ జనార్ధనరెడ్డి (టీడీపీ) పాల్గొన్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీవరకు జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ప్రధానంగా చర్చ జరిగింది.

తిరిగి అక్టోబర్ 14, 15 తేదీల్లో విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించారు. తొలుత గొల్లపల్లి మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా సభ సిఫారసు చేసిందని, దీంతో సమావేశం కావాల్సి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ మూడు రోజుల్లో సభ జరిగిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించగా సభ్యులు వీక్షించారు. సభా కార్యక్రమాలకు అడ్డం పడ్డారంటూ కొందర్ని గుర్తించిన కమిటీ వారికి నోటీసులు జారీ చేసి వాదనలు వినాలని నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై పట్టుబట్టి సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, ప్రజల మనోభావాలను ప్రతిబింబింపజేసేందుకు ప్రయత్నించిన వారిపై  చర్య తీసుకోవాలనే కమిటీ ఆలోచన  సరికాదని, ఇలా చేస్తే ప్రత్యేక హోదా ఆకాంక్షతో పోరాటం చేస్తున్న వారిని అవమానించినట్లేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్  గొల్లపల్లితో పాటు టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ సభ్యులు సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ. వారిని తప్పుబట్టే ప్రయత్నం చేశారు. పెద్దిరెడ్డి వారి వాదనలు తోసిపుచ్చారు.

 ప్రభుత్వం కుట్ర పన్నింది: పెద్దిరెడ్డి
  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందని మండిపడ్డారు.

 చెవిరెడ్డిని ఎందుకు చేర్చలేదు?
 తమ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ స్థానంలో హక్కుల కమిటీ సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ప్రతిపాదిస్తే ఇప్పటివరకు ఎందుకు నియామకం చేపట్టలేదని శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. హక్కుల కమిటీ భేటీ సమయంలో అక్కడికి వచ్చిన సత్యనారాయణతో ఆయన ఈ విషయం ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు