కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వ్యయం !

20 Nov, 2016 21:54 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వ్యయం !

హైదరాబాద్‌: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనకరమా కాదా? అనే అంశంపై టీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఇంజనీరింగ్ నిపుణులతో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కోదండరాం, అస్కీ మాజీ పరిశోధకులు గౌతమ్ షింగ్లే, విద్యుత్ రంగ నిపుణులు కె. రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నివేదికను గౌతమ్ షింగ్లే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.... కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎకరాలకు సగటున 42 వేల నుంచి 73 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. తుమ్మడి హెట్టి, మేడిగడ్డ రెండు చోట్ల నీటి లభ్యత దాదాపుగా సమానంగా ఉందన్నారు. ఎత్తిపోతల పథకానికి జలవిద్యుత్ లభ్యత నామమాత్రమేనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు 4వేల 500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందన్నారు. అన్ని ప్రాజెక్టులకు కలిపి 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. ఆదాయం 4 వేల కోట్ల రూపాయలు, మొత్తం ప్రాజెక్టు వ్యయం ఖర్చు రూ.17 వేల కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.71 వేల కోట్లు అవుతున్నట్లు నిపుణులు తేల్చారన్నారు. 1949 నుంచి ఇప్పటి వరకూ గోదావరిలో నీటిలభ్యతను పరిగణలోనికి తీసుకుని ఈ నివేదిక రూపొందించారని ఆయన తెలిపారు. ప్రతి ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాజెక్టుకు నీరు లభిస్తుందన్నారు. కాళేశ్వరం మీద శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ఇదని..అంతేకానీ జేఏసీ తయారు చేసింది కాదని కోదండరాం తెలిపారు.

మరిన్ని వార్తలు