బోన్సాయ్‌ మొక్కలపై ప్రచారం చేయాలి: మంత్రి తలసాని

26 Feb, 2018 02:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో ప్రాచుర్యం పొందిన బోన్సాయ్‌ మొక్కల పెంపకంవల్ల కలిగే ప్రయోజనాలు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పుణేలో బోన్సాయ్‌ అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంట్లో బోన్సాయ్‌ మొక్కలు పెంచడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ఇలాంటి సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తే ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.

14 శాతం ఉన్న పచ్చదనాన్ని 30 శాతంకు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మొక్కలు నాటినట్లు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన బోన్సాయ్‌ మొక్కల ప్రదర్శనకు 3వేల రకాల మొక్కలు వచ్చాయి. జర్మనీ, చైనా, ఫ్రాన్స్‌ తదితర 14 దేశాల నుండి ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్, మహారాష్ట్ర ఆర్థిక, అటవీ శాఖ మంత్రి సునీల్‌ మంగత్వార్, స్వామి గోవింద దేవగిరి, అల్‌ ఇండియా ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఉమర్‌ ఎలియస్, పుణే మేయర్‌ ముక్తా తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు