సామాన్యుడు సినిమాకు వెళ్లే పరిస్థితి లేదు

13 Apr, 2018 01:20 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: సినిమా టికెట్‌ ధరలను ఇష్టానుసారంగా వసూలు చేయడం, థియేటర్లలో తినుబండారాల ధరలు అధికంగా ఉండడంతో సామాన్యుడు కుటుంబసభ్యులతో కలసి సినిమాకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. సినిమా థియేటర్లలో టికెట్ల విక్రయాల్లో పారదర్శకత పాటించడం కోసం ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, దీని అమలుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆన్‌లైన్‌ సినిమా టికెటింగ్‌ విధానంపై గురువారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) చైర్మన్‌ రాంమోహన్‌రావు, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేది, సమాచారశాఖ కమిషనర్, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్, రెవెన్యూ(వాణిజ్య పన్నులు ) ప్రిన్సిపల్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్, న్యాయశాఖ సెక్రటరీ నిరంజన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో సమావేశం నిర్వహించి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అమలుకు చేపట్టవలసిన చర్యలను గుర్తించాలన్నారు. అనేక ప్రైవేటు ఆన్‌లైన్‌ వెబ్‌సైబ్‌లు రూ.20 నుండి రూ.40 వరకు సర్వీస్‌ చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రేక్షకులపై భారం పడుతోందని తెలిపారు. సినిమా థియేటర్లలోని క్యాంటీన్లలో తినుబండారాల ధరలు అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని, అలా కాకుండా ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సినిమా థియేటర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు