ప్రచారం కోసమే బీజేపీ రాద్ధాంతం

17 Apr, 2017 01:29 IST|Sakshi
ప్రచారం కోసమే బీజేపీ రాద్ధాంతం

► అసెంబ్లీలో మంత్రి తలసాని విమర్శ
► బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ఆర్‌.కృష్ణయ్య
► తక్షణమే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇవ్వాలి: జీవన్‌రెడ్డి
► వాల్మీకి, కాగిత లంబాడాలను మినహాయించాలి: రాజయ్య


సాక్షి, హైదరాబాద్‌: ప్రచారం కోసమే బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై రాద్ధాం తం చేస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ విమర్శించారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడుతూ మతపరంగా దేశంలో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటే వచ్చేసారి బీజేపీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితే ఉండదని ఆపార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఆ వర్గాలకు రిజర్వేషన్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

వాల్మీకి, రజకులు, వడ్డెరలను ఎస్టీలో కలపాలన్న డిమాండ్‌ ఉందన్నారు. ముస్లింల కోసం బీసీ (ఇ) రిజర్వేషన్లు పెంచినప్పుడు మిగిలిన ఏబీసీడీ వర్గాల వారు అసంతృప్తికి గురవుతా రన్నారు. బీసీలకు 25 శాతం నుంచి 52 శాతం రిజర్వేషన్లు పెంచాలన్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీలకు 14 నుంచి 15 శాతం, ఎస్టీలకు 4 నుంచి 6 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీచేశారన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలా చేసుకోవచ్చన్నారు.

కాబట్టి ప్రస్తుత బిల్లులో పేర్కొన్న ఎస్టీల రిజర్వేషన్లకు జీవో జారీచేసి వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్సీలకు ఒక శాతం పెంచుతూ జీవో జారీచేయాలన్నారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. వాల్మీకి, కాగిత లంబాడీలను ఇందులో చేర్చకూడదన్నారు.

మరిన్ని వార్తలు