హామీలను విస్మరించిన కేసీఆర్‌

21 Jan, 2017 04:14 IST|Sakshi
హామీలను విస్మరించిన కేసీఆర్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
భూపాలపల్లి: ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ విస్మరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తమ్మినేని చేపట్టిన యాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లు గడచినా ఆచరణలోకి రాలేదన్నారు. తండాలను పంచాయతీలుగా మారుస్తామని, నిరుపేద హరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామని నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

రైతులు పంటలకు గిట్టుబాటు ధరలేక నానా తంటాలు పడుతుంటే సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ఓపెన్ కాస్టు విధానం రద్దు చేస్తామని ప్రకటించి, తిరిగి బొందల గడ్డలుగా మార్చడానికి శ్రీకారం చుట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్  మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జాన్ వెస్లీ, ఎస్‌.రమ, ఎంవీ రమణ, ఎండీ.అబ్బాస్, ఆశయ్య, బందు సాయిలు, కంపేటి రాజయ్య, వెలిశెట్టి రాజయ్య, చక్రపాణి పాల్గొన్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలి  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి అన్న పదమే లేకుండా చేస్తామని, ప్రభుత్వం ఏర్పడగానే కాంట్రాక్ట్‌ కార్మికులు, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

భూపాలపల్లిలోని కేటీపీఎస్‌లో పనిచేస్తున్న 750 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించకపోగా వారిని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులుగా మార్చారన్నారు. కార్మిక చట్టాల ప్రకారం వారికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్లాంట్‌ నిర్మాణంలో భాగంగా నిర్వాసితులైన బాధిత కుటుంబాలకు పునరావాస కాలనీలు నిర్మించి, కేంద్ర భూసేకరణ, 2013 ప్రకారం వారికి పరిహారమివ్వాలని విజ్ఞప్తిచేశారు.

మరిన్ని వార్తలు