ఖైరతాబాద్‌కు తరలిన తాపేశ్వరం లడ్డూ

4 Sep, 2016 18:45 IST|Sakshi
ఖైరతాబాద్‌కు తరలిన తాపేశ్వరం లడ్డూ

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుని కోసం తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారు చేసిన లడ్డూను ప్రత్యేక వాహనంలో ఆదివారం తరలించారు. ఆరేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా స్వామివారికి సురుచి సంస్థ లడ్డూను కానుకగా సమర్పించింది. ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు ఈ ఏడాది 500 కిలోల లడ్డూను సిద్ధం చేశారు. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 19 మంది సిబ్బంది గణపతి మాలధారణ చేసి ఈ లడ్డూ తయారు చేశారు.

కాజూ పేస్టును ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మల్లిబాబు, భారతి దంపతులు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్రేన్‌తో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ గ్రామంలో అత్యంత కోలాహలంగా ఈ లడ్డూను ఊరేగించారు. లడ్డూ తరలింపును తిలకించేందుకు స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నేడు గాజువాకకు మహాలడ్డూ తరలింపు
విశాఖ జిల్లా గాజువాకలో ప్రతిష్ఠించనున్న మహాగణపతికి సురుచి ఫుడ్స్ కానుకగా అందజేస్తున్న మహాలడ్డూను సోమవారం ఉదయం తరలించనున్నారు. 12.50 టన్నుల బరువుతో రూపొందించనున్న ఈ మహాలడ్డూ తయారీలో ఆదివారం ఉదయం నుంచి సిబ్బంది నిమగ్నమయ్యారు. తుది మెరుగుల అనంతరం ప్రత్యేక వాహనంలో గాజువాక తరలించనున్నట్టు మల్లిబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు