బాలికలే టార్గెట్

21 May, 2016 01:47 IST|Sakshi

మాయమాటలు చెప్పి నగలు తీసుకొని ఉడాయింపు
నాలుగేళ్లుగా 150 చోరీలు  ఎట్టకేలకు పట్టుబడ్డ నిందితుడు

 

అంబర్‌పేట: బాలికలకు మాయమాటలు చెప్పి నగలతో ఉడాయిస్తున్న ఘరాన దొంగను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇతడి వద్ద నుంచి రూ. 7.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత నాలుగేళ్లుగా 8 నుంచి 12 ఏళ్ల వయసు బాలికలను లక్ష్యంగా చేసుకొని, వారికి మాయమాటలు చెప్పి బంగారం , వెండి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నాడు. శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్  వి. రవీందర్, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... బర్కత్‌పుర, రత్నానగర్‌కు చెందిన బాతుల రవికిరణ్(28) అలియాస్ టింకు ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్. ఈ విధంగా వచ్చే జీతం సరిపోకపోవడంతో మీడియాలో వచ్చే క్రైమ్ కథనాలకు ఆకర్షితుడై నేరాలు చేయవచ్చనే ఆలోచనకు వచ్చాడు. 2012 నుంచి కాలనీలు, పాఠశాల వద్ద సంచరిస్తూ 8 నుంచి 12 ఏళ్ల బాలికను టార్గెట్ చేసి నేరాలకు పాల్పడుతున్నాడు.


మీ తల్లిదండ్రులు నాకు బాగా తెలుసని, స్కాలర్‌షిప్‌లు, క్రీడాపరికరాలు బహుమతిగా ఇప్పిస్తానని బాలికలను నమ్మించి తన వాహనంపై కొంత దూరం తీసుకెళ్తాడు. మీ ఒంటిపై బంగారం ఉంటే స్కాలర్‌షిప్ ఇవ్వరని చెప్పి.. నగలు తీయించి, వాటిని పట్టుకొని ఉడాయిస్తున్నాడు. ఇలా ఇతను గత నాలుగేళ్లల్లో 150 చోరీలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఫొటోను సేకరించి మీడియాకు విడుదల చేశారు. ఈ ఫొటో చూసిన వారు రవికిరణ్ ఆచూకీని పోలీసులకు చేరవేశారు. పోలీసులు రత్నానగర్‌లో రవికిరణ్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద రూ.7.10 లక్షలు విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు 2.7 కిలోల వెండి, ద్విచక్రవాహనం, ఫాన్ బ్రోకర్‌లకు నగలు అమ్మిన రశీదులను స్వాధీనం చేసుకున్నారు.


కాగా, ఇతను ఇప్పటి వరకూ 150 చోరీలు చేసినప్పటికీ..  చేసినవి చిన్న చిన్న ఆభరణాలు కావడంతో కేవలం 28 ఫిర్యాదు మాత్రమే పోలీసులకు అందాయని డీసీపీ తెలిపారు.  ఫిర్యాదు అందని కేసులకు సంబంధించిన సొత్తును కోర్టుకు అప్పగిస్తామని ఆయన అన్నారు.  రవికిరణ్ నాలుగేళ్లగా చోరీలకు పాల్పడుతున్నా... పోలీసులకు పట్టుబడటం మాత్రం ఇదే తొలిసారి.

 
కొనుగోలు చేసిన వారిని సైతం...

రవికిరణ్ నుంచి దొంగ బంగారం కొనుగోలు చేసిన నాలుగురు పాన్ బ్రోకర్లను సైతం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో చిక్కడపల్లికి చెందిన వినోద్‌కుమార్(52), తిలక్‌నగర్‌కు చెందిన సంతోష్‌జైన్(33), కాచిగూడకు చెందిన జెయేష్ గాంధీ(38), నారాయణ గూడకు చెందిన గౌతమ్ చంద్ జైన్ ఉన్నారు.   సమావేశంలో కాచిగూడ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, అడిషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నల్లకుంట డిటెక్టిటివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్రలు పాల్గొన్నారు. 

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా