‘మా ఇష్టం’ ఇక చెల్లదు

19 Aug, 2015 03:43 IST|Sakshi
‘మా ఇష్టం’ ఇక చెల్లదు

- విధులకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలే..
- ఉన్నతాధికారుల సీరియస్
- ‘సాక్షి’ కథనానికి స్పందన
- హెచ్‌ఎండీఏలో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్
సాక్షి, సిటీబ్యూరో:
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు సెక్రటరీ బాలాజీ రంజిత్ ప్రసాద్ తెలిపారు. కొందరు ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తున్న విషయాన్ని తేటతెల్లం చేస్తూ ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించి చర్యలకు ఉపక్రమించారు.

ఉద్యోగులు విధుల్లోకి వచ్చేటప్పుడే కాదు... తిరిగి వెళ్లేటప్పుడు కూడా అటెండెన్స్ తీసుకొంటామన్నారు. ప్రస్తుతం గ్రీవెన్స్ సెల్‌లో ప్రత్యేకంగా రెండు రిజిస్టర్లు పెట్టామని, ఇన్‌టైంలో వచ్చినవారు ఒక రిజిస్టర్‌లో, ఆలస్యంగా వచ్చినవారు మరో రిజిస్టర్‌లో సంతకం పెట్టేలా జాగ్రత్తలు తీసుకొన్నామని తెలిపారు. నెలకు 3 రోజుల లేట్‌కు 1 సీఎల్ చొప్పున కట్ అవుతుందని, అదే 10.45 గం.ల తర్వాత విధులకు హాజ రైతే ఆఫ్ డే లీవ్ పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకు, అటెండర్ స్థాయి సిబ్బంది ఉదయం 9.30 గంటలకే విధులకు హాజరు కావాలని , అటెండెన్స్ ఆధారంగానే సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని  తెలిపారు.
 
జవాబుదారీతనం కూడా ఉండాలి: సోమేశ్‌కుమార్
ఉద్యోగులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి రావడమే కాదు.. పనిలోనూ జవాబుదారీ తనం అవసరమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నా రు. గ్రేటర్ కార్యాలయాల్లో సిబ్బంది, ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడంపై ఆయన స్పందిస్తూ  జీహెచ్‌ఎంసీలోని ఉన్నతాధికారులు (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు)   ఉద్యోగ వేళల్ని మించి పనిచేస్తున్నారని, ఆదివారాలు, సెలవులు లేకుండా పనిచేస్తున్నారన్నారు. మిగతా కార్యాలయ సిబ్బందిపై అజమాయిషీ లోపించడం నిజమేనన్నారు. వారు సక్రమంగా హాజరయ్యేందుకు మాత్రమే కాదు.. బాధ్యతాయుతంగా వ్యవహరించేం దుకు అందుబాటులోని సాంకేతిక విధానాల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. బయోమెట్రిక్ హాజరుతోనే కాదు.. ఏపనిని ఎంత కాలంలో చేస్తున్నారనేది అంచనా  వేసేందుకూ  అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
 
కఠిన చర్యలు తీసుకోండి: డీఈఓలకు ఆర్‌జేడీ సుధాకర్ ఆదేశం
ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో హాజ రుకాని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని  హైదరాబాద్ ప్రాంతంలోని డీఈఓలను రీజినల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్ ఆదేశించారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరుకాని తీరుపై ‘సాక్షి’ మంగళవారం ‘ప్రార్థనకు రాని సార్లు’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివిన ఆర్‌జేడీ స్పందించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయుల పట్ల ఉపేక్షించకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రార్థన సమయంలో ఉండని హెచ్‌ఎంలు, టీచర్లకు ఉదయం పూట సీఎల్ (క్యాజువల్ లీవ్) అమలు కచ్చితంగా చేయాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు