బెదిరింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్టు

3 Oct, 2016 21:29 IST|Sakshi
బెదిరింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్టు
మారేడుపల్లి: హత్య కేసులో సాక్షులను కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడినందుకు సికింద్రాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు బద్రీ యాదవ్‌ను మారేడుపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఉమామహేశ్వర్‌ రావు కథనం ప్రకారం...మారేడుపల్లిలో 2012లో శేఖర్‌ అనే స్థానికుడు రౌడీషీటర్స్‌ చేతిలో హత్యకు గురైనాడు. హతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదుతో గొల్ల కిట్టుతో పాటు పలువురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
 
 
నాలుగు నెలల క్రితం గొల్ల కిట్టుతో పాటు తొమ్మిది మంది నర్సమ్మతో పాటు ఆమె బంధువులను కిడ్నాప్‌ చేసి..  కేసు రాజీ చేసుకోవాలని బెదిరించారు. ఈ విషయంపై సెప్టెంబర్‌ 19న నర్సమ్మ  నార్త్‌ జోన్‌ డీసీపీ సుమతికి ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌ చేసిన తమను స్థానిక టీడీపీ నాయకుడు బద్రీ యాదవ్‌ కార్యాలయానికి తీసుకెళ్లి.. కేసు రాజీ చేసుకోవాలని బెదిరించి, రూ. 5 లక్షలు ఇచ్చారని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.  సోమవారం బద్రీ యాదవ్, రాజుయాదవ్‌ (రౌడీషీటర్‌)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గొల్ల కిట్టుతో పాటు మిగతా నిందితులు పరారీలో ఉన్నారని సీఐ చెప్పారు. 
 
 
మంత్రి ఒత్తిడితోనే: బద్రీ యాదవ్‌
హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధంలేదని బద్రీ యాదవ్‌ విలేకరులకు తెలిపారు. వివిధ సమస్యలపై బస్తీవాసులు రోజూ తన కార్యాలయానికి వస్తూ ఉంటారని, పథకం ప్రకారమే...  అది కూడా మంత్రి తలసాని ఒత్తిడి మేరకు నాలుగు నెలల తర్వాత కేసు పెట్టారని బద్రీ యాదవ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి, తాను టీడీపీనుంచి కార్పొరేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయడంతో మంత్రి కక్షగట్టి తనపై కేసు నమోదు చేయించారని ఆయన అన్నారు.   పోలీసు ఉన్నత అధికారలు వాస్తవాలు తెలుసుకొని కేసులు నమోదు చేయాలన్నారు. 
>
మరిన్ని వార్తలు