టీడీపీ నేత కంభంపాటి అక్రమకట్టడం కూల్చివేత

4 Jul, 2016 17:34 IST|Sakshi
టీడీపీ నేత కంభంపాటి అక్రమకట్టడం కూల్చివేత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మెహనరావు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు.  రామ్మోహనరావు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన తన ఇంటికి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయమే ఆ కట్టడాన్ని కూల్చేశారు.

ఇటీవలి కాలంలో అక్రమ కట్టడాల విషయంలో జీహెచ్ఎంసీ సీరియస్గా వ్యవహరిస్తోంది. కూకట్ పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాలలో తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే చర్యలు తీసుకుంటోంది. గత వారం 15 రోజులుగా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమపై వచ్చే రాజకీయ ఒత్తిళ్లను కూడా పక్కనపెట్టి కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అక్రమం కాదు.. నేనే కూల్చేశా: కంభంపాటి
కాగా, అది అక్రమ నిర్మాణం కాదని.. ఇంటి బయట వాచ్ మన్ నివాసం కోసం చిన్న గదిలాంటిది కట్టిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. దాంతో తానే మనుషులను పెట్టి దాన్ని కూల్చేసినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు