టీడీపీది కాంగ్రెస్ దారి!

8 Oct, 2016 02:47 IST|Sakshi
టీడీపీది కాంగ్రెస్ దారి!

రాష్ట్రంలో పార్టీకి మనుగడలేదని నేతల భావన
టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేక కాంగ్రెస్‌వైపు మొగ్గు
వద్దంటున్న కాంగ్రెస్ నేతలు

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరేం దుకు పలువురు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అధికార టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అవకాశం లేక, ఆత్మాభిమానాన్ని కాదనుకుని ఆ పార్టీలోకి వెళ్లినా ఇమడలేని పరిస్థితుల దృష్ట్యా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కొందరు టీడీపీ ముఖ్య నాయకులు మొగ్గుచూపడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పార్టీలో చేరడమే రాజకీయంగా శ్రేయస్కర నిర్ణయమని భావిస్తున్నా, ఆ ప్రయత్నాలను కాంగ్రె స్‌లోని ముఖ్యనేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ రాజకీయంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొం టున్న నేపథ్యంలో ఆ పార్టీ  సీనియర్ నాయకులకు ఎటూ పాలుపోని స్థితి ఏర్పడింది.

టీడీపీ ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోవడంతో రాజకీయ భవిష్యత్ లేని పార్టీ లో కొనసాగడంపై పలువురు నేతల్లో తీవ్రస్థాయిలో అంతర్మథనం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో చేరే ఆశతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా ఆ పార్టీ తలుపులు మాత్రం వీరికి తెరుచుకోవడం లేదు. జాతీయ పార్టీగా.. ఏ పార్టీ నాయకులు వచ్చినా కాంగ్రెస్ తనలో ఇముడ్చుకుంటుందని, అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం కూడా ఉంటుందనే నమ్మకంతో ఆ పార్టీలో చేరేందుకు ఈ నాయకులు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇటువంటివారిలో ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన మాజీ ఎంపీ లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారని సమాచారం. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నా అవి విఫలమవుతున్నాయని తెలుస్తోంది.

జిల్లాల్లో విభేదాలే కారణం..
చాలా ఏళ్లుగా జిల్లాస్థాయిల్లో రెండు పార్టీల ముఖ్యనాయకుల మధ్య ఉన్న విభేదాలే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనితో పాటు టీడీపీ నాయకులు ప్రవేశిస్తే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతో ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ ముఖ్యనాయకులు వారి చేరిక ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అంతేకాక సామాజిక వర్గాల పరంగా కూడా ఈ వ్యతిరేకత కొనసాగుతోందని తెలుస్తోంది. కొందరు ఎస్సీ, ఎస్టీ నాయకుల రాకను ఒక కేంద్ర మాజీమంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్‌లో ఎస్టీనేతగా తనకున్న ప్రాధాన్యం, గుర్తింపు తగ్గిపోతుందనే ఆయన టీడీపీ నేతల చేరికపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో టీడీపీ మాజీ ఎంపీలను తీసుకుంటే వారితో పాటు ఆ ఎంపీ సీటు పరిధిలోని ఇతర నాయకులు కూడా పార్టీలోకి వస్తే తమ అనుయాయులకు కూడా నష్టం జరుగుతుందని వారు ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇక  టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అడుగుపెట్టకుండా కాంగ్రెస్‌లోని మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయా జిల్లాల్లోని టీడీపీ-కాంగ్రెస్ కేడర్ మధ్య కూడా సయోధ్య లేకపోవడం టీడీపీ నేతల చేరికకు అడ్డంకిగా మారుతోంది.

>
మరిన్ని వార్తలు