ఏడాదిలోనే డిగ్రీ పాస్‌.. భారీగా భూదందా!

7 Jun, 2017 15:20 IST|Sakshi
ఏడాదిలోనే డిగ్రీ పాస్‌.. భారీగా భూదందా!

హైదరాబాద్‌: సీసీఎస్‌ అధికారులు అరెస్టు చేసిన టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై గతంలో ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దీపక్‌రెడ్డికి 15 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగ పత్రాలు సృష్టించి ఎన్నో ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే చోట దీపక్‌రెడ్డికి 3 వేల 128 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. 2012 ఉప ఎన్నికలో రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్‌రెడ్డి...2017లో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ  నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అయితే 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో 6 వేల 781 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్లు అఫిడవిట్ సమర్పించాడు. దాంతోపాటు కేవలం ఏడాది కాలంలోనే డిగ్రీ పాసైనట్లు దీపక్‌రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. శంషాబాద్‌ మండలం కొత్వాల్‌ గూడెలో అతనికి విలువైన మూడు ఎకరాలకు పైగా భూములు వున్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్‌ 12 లో అత్యంత ఖరీదైన 8084 చదరపు అడుగుల స్థలం, అదే రోడ్‌లో అతని భార్యకు 13,224 చదరపు అడుగుల స్థలం  వున్నాయి. అలాగే శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్‌ రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2400 గజాల స్థలం వున్నాయి. జూబ్లీహిల్స్‌లోనూ అతని భార్య పేరుతో 7 కోట్లకు పైగా విలువచేసే 16,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం వుంది.

దీపక్‌ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ IPC 506 కింద అతనిపై రెండు కేసులు, అక్రమణలకు పాల్పడ్డాడంటూ IPC 447 సెక్షన్‌ కింద మరొక కేసు నమోదయ్యాయి. కేసుల పరంపర అంతటితోనే ఆగలేదు. అడ్డుకోవడంతోపాటు దాడి చేశాడంటూ IPC 341 కింద కేసు, అల్లర్లకు పాల్పడ్డాడంటూ 147 సెక్షన్‌ కింద కేసు, మారణాయుధాలు కలిగి వున్నాడంటూ 148 సెక్షన్‌ కింద మరొక కేసు నమోదయ్యాయి.

భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టేందుకే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు మరికొందరు ప్రయత్నించారని....విచారణలో అది నిజమని తేలడంతో  అరెస్ట్‌ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. దొంగ పత్రాలు సృష్టించి భూములు కొల్లగొట్టేందుకు యత్నించారని చెప్పారు. వందల ఎకరాల కబ్జా చేసినట్టు పలు స్టేషన్ల నుంచి ఫిర్యాదులు రావడంతోనే....కేసును విచారణకు స్వీకరించి అరెస్ట్ చేశామన్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్‌తో ఆయన బాధితుల సంబరాలు అంబరాన్నంటాయి. బోజగుట్టలో బాధితులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా తమను దీపక్‌రెడ్డి బెదిరిస్తూ ఎన్నో భూములను కబ్జా చేశాడని...ఎట్టకేలకు దీపక్‌రెడ్డి అరెస్ట్‌తో తమ బాధలకు విముక్తి లభించిదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రిమాండ్‌లో ఉన్నా ఫోన్ లో రాయబారాలు
సాధారణంగా రిమాండ్‌లో వున్న వ్యక్తి ఫోన్‌ ఉపయోగించడం రూల్స్‌ ఒప్పుకోవు. అయితే దీపక్‌ రెడ్డి ముందు రూల్స్‌ బలాదూర్‌ అన్నట్లుగా వుంది. ఆయనను 15 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ దీపక్‌ రెడ్డి పోలీసుల రిమాండ్లో ఉండగానే నింపాదిగా ఫోన్‌లో రాయబారాలు జరపడం సాక్షి కెమెరాకు చిక్కింది.

మరిన్ని వార్తలు