టీచర్లను అవమానించడమే

8 Jul, 2016 02:15 IST|Sakshi

- పీఆర్టీయూ అధ్యక్షుడి సస్పెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
 సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డిని సస్పెండ్ చేయడం టీచర్లను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. బడిబాట సమీక్షలో హెచ్‌ఎంలను దూషించిన మహబూబ్‌నగర్ కలెక్టర్ తీరును ప్రశ్నించినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని పేర్కొన్నాయి. పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా విలేకరుల సమావేశం పెట్టినంత మాత్రాన ఎలా సస్పెండ్ చేస్తారని పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.
 
 సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి, కలెక్టర్ తీరుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ల పట్ల అవమానకరంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీచర్లను బదిలీ చేసిన కలెక్టర్.. ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెన్నయ్య, రవిశంకర్‌రెడ్డి, షౌకత్ అలీ తదితరులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు