మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా?

5 Mar, 2016 08:08 IST|Sakshi
మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా?

ఉపాధ్యాయ సంఘాల భేటీలో విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాబోయే విద్యావార్షిక క్యాలెండర్‌పై చర్చించేందుకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ ఏర్పాటుచేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో పాల్గొన్న కొన్ని సంఘాలు విద్యాశాఖ రూపొందించిన నూతన క్యాలెండర్‌ను స్వాగతిస్తున్నామని చెప్పగా, మరికొన్ని సంఘాలు ఈ క్యాలెండర్ అమలును వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేయాలని పట్టుబట్టాయి. సమావేశపు ఎజెండాలోని పలు అంశాలపై కొన్ని సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ తమ అభ్యంతరాలను ప్రకటించారు.

అభిప్రాయాలు చెప్పేందుకు ప్రతి సంఘానికి ఎంతసేపైనా సమయమిస్తానని డెరైక్టర్ ప్రకటించినా, కొందరు ప్రతినిధులు పదేపదే లేచి నిలబడి వాదులాడుకోవడం పట్ల డెరైక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా.. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఇక్కడ కెమెరాలు కూడా లేవే’..అన్నారు.  
 
వార్షిక కేలండర్‌పై ఎవరేమన్నారంటే..

రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విద్యావిధానాన్ని అవలంభిస్తే ఇబ్బంది లేదుకానీ, సీబీఎస్‌ఈ అకడమిక్ క్యాలెండర్‌ను అమలు చేస్తే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. సీబీఎస్‌ఈ క్యాలండర్ ప్రకారం మార్చి 21నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని, ఆ సమయంలో ఎంతోమంది ఉపాధ్యాయులు టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ ఆపై మూల్యంకన విధులకు వెళతారని చెప్పారు. ఈ దృష్ట్యా నూతన విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి భుజంగరావు మాట్లాడుతూ..ప్రస్తుత ఏడాది షెడ్యూల్ ముందుగానే ఖరారైనందున, కొత్త క్యాలండర్‌ను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేయాలని కోరారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మధుసూదనరావు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక గది, ఒక టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. నూతన క్యాలండర్‌ను తాము స్వాగతిస్తున్నామన్నారు. మార్చి 21 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా ప్రభుత్వం రూపొందించిన విద్యావార్షిక క్యాలండర్‌ను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్వాగతించారు.

మరిన్ని వార్తలు