టెన్త్ ‘స్పాట్’కు టీచర్ల కొరత

10 Apr, 2016 00:42 IST|Sakshi
టెన్త్ ‘స్పాట్’కు టీచర్ల కొరత

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. అన్ని జిల్లాల్లోనూ పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. వరుస సెలవులు, ఎండల ప్రభావమో కానీ స్పాట్ కేంద్రాలకు ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత అరకొరగా వచ్చినా, దాదాపు అన్ని కేంద్రాల్లో ఉపాధ్యాయుల హాజరు 50 శాతానికి మించలేదు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది.

ఈ నెల 22లోగా వాల్యుయేషన్ పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మూల్యాంకనం కోసం జిల్లాకు 5 లక్షల చొప్పున వాల్యుయేషన్ కేంద్రాలకు పంపిణీ చేశారు. అయితే ఉపాధ్యాయుల హాజరుకాకపోవడంతో స్పాట్ కేంద్రాలకు క్యాంపు అధికారులుగా వ్యవహరిస్తున్న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలాగే ఉంటే గడువులోగా మూల్యాంకనం పూర్తిచేయడం సాధ్యం కాదని డీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రైవేటు యాజమాన్యాలు ససేమిరా
 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే, ప్రైవేటు పాఠశాలలే అధికంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యలోనూ ప్రైవేటు స్కూళ్లదే  సింహ భాగం కావడంతో, మూల్యాంకనానికి ప్రైవేటు పాఠశాలల టీచర్లపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. స్పాట్ వాల్యుయేషన్ కోసం టీచర్లను స్పాట్ కేంద్రాలకు పంపాలని విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఈ జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. తమ టీచర్లను పంపితే స్కూల్లో బోధన కుంటుపడుతుందని కొన్ని, తమవద్ద అనుభవజ్ఞులైన టీచర్లు లేరని మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు సాకులు చెబుతున్నాయి. ఎండలకు భయపడి వాల్యుయేషన్ నుంచి తప్పించుకునేందుకు టీచర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 
 స్పాట్‌కు రాకుంటే కఠిన చర్యలు
 ‘ఉత్తర్వులు అందుకున్న టీచర్లంతా స్పాట్ కేంద్రాల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. ప్రభుత్వ టీచర్లకు కానీ ప్రైవేటు టీచర్లకు కానీ మినహాయింపు లేదు. విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపైనా, వారిని రిలీవ్ చేయకుంటే స్కూళ్ల యాజమాన్యాలపైనా చర్యలు తీసుకుంటాం. సకాలంలో స్పాట్‌ను పూర్తిచేసి అనుకున్న సమయానికి ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం’
 -సురేందర్‌రెడ్డి. పరీక్షల విభాగం డెరైక్టర్

whatsapp channel

మరిన్ని వార్తలు