వేట మొదలైంది...

2 Nov, 2015 00:02 IST|Sakshi
వేట మొదలైంది...

గొలుసు దొంగల ఆటకట్టించేందుకు..
రంగంలోకి యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్
నిపుణుల ఆధ్వర్యంలో బైక్ రేసింగ్, ‘షార్ట్ వెపన్’ శిక్షణ
పలు ప్రాంతాల్లో నిఘా...   తక్షణమే స్పందించేందుకు సిద్ధం

 
సిటీబ్యూరో:  నగరంలో చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు సైబరాబాద్ యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. జంట పోలీసు కమిషనరేట్‌లలో వరుస గొలుసు దొంగతనాలతో సవాల్ విసురుతున్న అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక గ్యాంగ్‌ల పనిపట్టేందుకు మూడంచెల్లో కఠోర శిక్షణ పొందిన ఈ బృందాలు ఆదివారం నుంచి వేట మొదలెట్టాయి. 55 బృందాలతో పాటు 30 మంది సభ్యులతో కూడిన ఐదు నేర విభాగ బృందాలు సివిల్ డ్రెస్సులో బహిరంగ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గంటల తరబడి తిరుగుతూ అనుమానంగా కనిపిస్తే చాలు వారి ఫొటోలను క్లిక్‌మనిపిస్తున్నారు. మహిళలను వెంబడిస్తున్నట్టుగా అనిపిస్తే వారిని అనుకరించి పట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

వారం రోజుల శిక్షణ...
‘పిల్లర్ రైడర్ ముఖానికి రుమాలు...బైకర్ మొహానికి కర్చీఫ్‌తో పాటు హెల్మెట్...బ్రేక్ వేస్తే బైక్ ఎగిరిపడుతుందా అన్నట్లుగా అతి వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకెళ్తున్నారు. సేమ్ టూ సేమ్ వీరి వెనకాలే అంతే వేగంతో ఇద్దరు మరో బైక్‌పై దూసుకెళ్లి ముందు వెళ్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ముందు బైక్ వ్యక్తులు తమ వద్దనున్న ఆయుధాలతో దాడి చేయబోతే పిడుగుద్దులతో వారిని నిలువరించారు.’ ఈ దృశ్యాలు ఉస్మాన్‌సాగర్ గండిపేట చెరువు ప్రాంతంలో గత వారం రోజులుగా కన్పిస్తున్నాయి.  విషయమేంటంటే...యాంటీ చైన్‌స్నాచింగ్ టీంకు ఇక్కడ ఈ తరహాలో శిక్షణ ఇస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వీయ పర్యవేక్షణలో ఏఆర్ ఏసీపీ కిష్టయ్య నేతృత్వంలో 110 మందితో కూడిన బృందాలతో పాటు నేర విభాగం నుంచి మరో 30 మంది ఈ రకమైన తర్ఫీదు పొందారు. గొలుసు దొంగలు ఎలా ఉంటారు...వారి వ్యవహారశైలి ఎలా ఉంటుంది..వారిని గుర్తించడం ఎలా వంటి అంశాల్లో నిపుణులతో శిక్షణ ఇప్పించారు. మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషన్ క్లాసులు, రివాల్వర్, తుపాకులు ఉపయోగించే విధానం, బైక్ రేసింగ్ చేయడంలో మెళకువలను ప్రాక్టికల్‌గా నేర్పించారు. వారం రోజుల పాటు ఉదయం ఆరు నుంచి 11.30 గంటల వరకు బైక్ రేసింగ్, ఆ తర్వాత షార్ట్‌వెపన్స్ వినియోగం, మోటివేషనల్ తరగతులు నిర్వహించారు.   
 
ఆత్మరక్షణ కోసమైతే కాల్పులే...

 చైన్ స్నాచింగ్స్ జరిగినప్పుడు బాధితులు ఆలస్యంగా ఫిర్యాదుచేస్తున్నారు. దాంతో దొంగల్ని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్‌కు అంకురార్పణ జరిగింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలోనే ఉండటం వల్ల ఒకవేళ చోరీ జరిగినా వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకునేందుకు అస్కారముంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ముఠాలు తారసపడితే వెంబడించేందుకు హైస్పీడ్ బైక్‌లు ఇచ్చారు. దుండగులు ఎదురుతిరిగితే ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉండేందు కోసం...అంటే ఆత్మరక్షణార్ధం ఎదురుతిరిగేందుకు చట్టంలో వెసులుబాటు ఉండటంతో అవసరమైతే కాల్పులు జరిపేందుకు వెనుకాడకుండా సిబ్బందిని తీర్చిదిద్దారు.  
 
స్నాచర్లు..క్యాచర్లుగా...
స్నాచర్లు, క్యాచర్లుగా పోలీసులు ద్విపాత్రాభినయం చేస్తూ ప్రాక్టీసు చేశారు. స్నాచర్లు...ఎంత వేగంగా బైక్‌లను నడుపుతూ తప్పించుకుంటారో అంతే వేగాన్ని ప్రయోగించి దొంగలను పట్టుకోవడంపై శిక్షణ ఇచ్చాం. మామూలు రోడ్లపై సాధారణ జనానికి ఇబ్బంది కలగకుండా స్నాచర్లను పట్టుకోవడం...చైన్ స్నాచర్లు ఆయుధాలతో ఎదురుతిరిగితే ఎలాంటి ఎత్తులు వేయాలో నేర్పాం.  ఆత్మవిశ్వాసం, ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో కష్టమైనా పోలీసులు ఇష్టంగా అన్ని అంశాల్లో ఆరితేరారు.      - కిష్టయ్య, ఏఆర్ ఏసీపీ
 

మరిన్ని వార్తలు