తెరుచుకున్న కాళేశ్వరం బ్యారేజీల సాంకేతిక టెండర్లు

3 Jun, 2016 03:17 IST|Sakshi

రూ. 5,813 కోట్లతో 3బ్యారేజీల పనులకు టెండర్‌లు వేసిన ప్రముఖ కంపెనీలు

 సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించే మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీల నిర్మాణాల సాంకేతిక టెండర్లను నీటి పారుదల శాఖ గురువారం తెరిచింది. ఈ పనులను పొందేందుకు 12 కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నిర్మించే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు, వాటి పంప్‌హౌజ్‌ల నిర్మాణం, హైడ్రోమెకానికల్ పనుల కోసం వేర్వేరుగా అంచనా వ్యయాలు సిద్ధం చేశారు.

ఇందులో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్ధ్యంతో 3 బ్యారేజీల నిర్మాణానికి, మేడిగడ్డకు రూ.2,591కోట్లు, అన్నారం 1,785కోట్లు, సుందిళ్లకు 1,437 కోట్లకు మొత్తంగా రూ.5,813కోట్లతో ప్రభుత్వం పాలనా అనుమతులిచ్చి వీటికి తొలుత గత నెల 18న టెండర్లు పిలిచింది. కాగా టెండర్ల గడువు బుధవారం సాయంత్రానికే ముగియగా, గురువారం ఉదయం సాంకేతిక బిడ్‌లు తెరిచారు. ఇందులో మెగా, నవయుగ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, అస్కాన్స్, సుచిత వంటి కంపెనీలు పోటీపడినట్లుగా తెలుస్తోంది.  

 రేపు తెరుచుకోనున్న పంప్‌హౌజ్‌ల బిడ్లు
కాగా పంప్‌హౌజ్‌ల నిర్మాణ టెండర్లు శని వారం తెరుచుకోవచ్చు. రూ.7,998 కోట్లతో ఈ టెండర్లను పిలిచారు. మేడిగడ్డ-అన్నారం ఎత్తిపోతలకు 3,524కోట్లు, అన్నారం-సుం దిళ్ల ఎత్తిపోతలకు  2140 కోట్లు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి నిర్మాణాలకు రూ.2,140కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చారు.

మరిన్ని వార్తలు