సామాన్యుడికి మేలుచేయని టెక్నాలజీ వృథా

22 Aug, 2015 12:05 IST|Sakshi
సామాన్యుడికి మేలుచేయని టెక్నాలజీ వృథా

స్మార్ట్ టెక్నాలజీలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం సరికాదని, మన పల్లెలు కూడా వాటి ప్రయోజనాలను పొందాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. స్మార్ట్ టెక్నాలజీలపై హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ పొందిన అతి తక్కువ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని ఆయన చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో అన్ని ఇళ్లకూ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు.

డిజిటల్ లిటరసీ మిషన్ అనే మరో ప్రధాన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం చేపట్టిందని, దీని ద్వారా ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి డిజిటల్ అక్షరాస్యత కల్పించడం తమ లక్ష్యమని అన్నారు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించని టెక్నాలజీ వృథాయేనని వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం మంచిదే అయినా, పల్లెలే దేశానికి వెన్నెముక అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రైతులకు కూడా సాయం చేసేందుకు తమ ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని కేటీఆర్ చెప్పారు.

 

మరిన్ని వార్తలు