ర్యాష్ డ్రైవింగ్ తో అభిషేక్ బీభత్సం

29 Oct, 2016 09:45 IST|Sakshi
ర్యాష్ డ్రైవింగ్ తో ‘మైనర్’ బీభత్సం

హైదరాబాద్: చిన్నారి ‘రమ్య’ విషాదాంతం మరవక ముందే అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అంబర్పేట డీడీ కాలనీలో ఓ ఇంటర్ విద్యార్థి శనివారం అతి వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అంబర్‌పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ పటేల్ కుమారుడు డీడీ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటున్నాడు. ఈ రోజు ఉదయం ఓ బాలికతోపాటు ముగ్గురు స్నేహితులతో కలసి కారులో కళాశాలకు బయలుదేరాడు.

అతడు వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీ కొట్టబోయాడు. అతడిని తప్పించేందుకు కారును రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న కార్లను ఢీ కొట్టాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కారులో పరిశీలించగా మద్యం బాటిళ్లు కనిపించాయి. అందులో ఉన్న బాలికను ఇంటికి పంపించి అభిషేక్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై అంబర్ పేట సీఐ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... ఈరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్తో ప్రమాదం చేసినట్లు సమాచారం అందిందన్నారు. డీడీ కాలనీలోని సోమసుందర్ నగర్ లో ఆగి ఉన్న కార్లతో పాటు ఓ వ్యక్తిని ఢీకొట్టినట్లుగా గుర్తించామని, గాయపడిన వ్యక్తి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, విత్ అవుట్ లైసెన్స్ సెక్షన్ల కింద మైనర్తో పాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు