నవతరం పారిశ్రామికవేత్తలుగా యువత

14 Sep, 2016 01:53 IST|Sakshi
నవతరం పారిశ్రామికవేత్తలుగా యువత

* నిజామాబాద్ ఎంపీ కవిత
* నైపుణ్యాభివృద్ధిపై టిఫ్‌తో తెలంగాణ జాగృతి ఒప్పందం

సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, గ్రామీణ యువతను నవతరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాల్సి ఉందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యువతలో నైపుణ్యం, వ్యవస్థాపక సామర్థ్యం పెంపుదలకు సంబంధించి తెలంగాణ పారిశ్రామివేత్తల సంఘం(టిఫ్)తో తెలంగాణ జాగృతి మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో ఎంపీ కవిత మాట్లాడుతూ... ఈ ఒప్పందం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు..

పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పారిశ్రామికాభివృద్ధి హైదరాబాద్ పరిసరాలకే పరిమితం కాకుండా.. వికేంద్రీకరణ ద్వారా జిల్లాలకు విస్తరిస్తామన్నారు. జిల్లాల్లో స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు కావాలని, నిజామాబాద్‌లో సీడ్ పార్కు, వరంగల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కులవృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తున్న రైతు బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

పారిశ్రామిక రంగంలో తెలంగాణకు పూర్వ వైభవం సాధించడంతో పాటు.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. జనావాసాల్లో ఉన్న సూక్ష్మ, లఘు పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పరిశ్రమలకు తాగునీరు, ఆస్తిపన్ను తదితర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సంబంధించి టిఫ్‌తో కలసి పనిచేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం పాత్రను కవిత ప్రస్తావించారు.
 
ఉపాధి కల్పనపై దృష్టి పెట్టండి
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం చూడకుండా ఉపాధి కల్పనపై యువత దృష్టి సారించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి కల్పిం చేలా పరిశ్రమలను స్థాపించాలన్నారు. టీ హబ్ తరహాలో తెలంగాణ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. పారి శ్రామికవృద్ధి జరిగితేనే వాణిజ్యాభివృద్ధి జరుగుతుందని సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన టీఎస్‌ఐపాస్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు, రిచ్, టాస్క్ తదితరాల ప్రత్యేకతలను టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి వివరించారు.

తెలంగాణ జాగృతితో కలసి 18 పారిశ్రామికవాడల్లో టిఫ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తుందని టిఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా టిఫ్ ప్రచురించిన ‘మేకిన్ తెలంగాణ’ సంచికను ఎంపీ కవిత ఆవిష్కరించారు. సమావేశంలో టిఫ్ ప్రతినిధులు ఆనంద్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎఎల్‌ఎన్ రెడ్డి, హరినాథ్, లక్ష్మణరావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు