రేపటి నుంచి తెలంగాణ బోనాలు..

6 Jul, 2016 19:22 IST|Sakshi

 తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే బోనాల ఉత్సవాలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు లంగర్‌హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి. నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే అమ్మవారి బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై, ఇక్కడే ముగియనున్నాయి.

 

ఆషాఢ మాసం అమావాస్య తరువాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారాల్లో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి నెల రోజుల పాటు ప్రతి గురు, ఆది వారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు.

నజర్ బోనం, భారీ తొట్టెలు..
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే మొదటి పూజలో అమ్మవారికి లంగర్‌హౌస్ వాసులు నజర్ బోనం సమర్పిస్తారు. గురువారం లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, 32 అడుగుల ఎత్తై భారీ తొట్టెలను తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది.

ప్రభుత్వం తర ఫున పట్టు వస్త్రాలు..
బోనాల ప్రారంభ ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు సమర్పించి ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటా బజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారికి పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది.

 

మరిన్ని వార్తలు