వర్సిటీలకు కష్టకాలమే!

15 Mar, 2016 01:48 IST|Sakshi
వర్సిటీలకు కష్టకాలమే!

* ఉన్నత విద్యకు పెరగని కేటాయింపులు... సాంకేతిక విద్యకు కోత
* పీఆర్సీ మేరకు వేతనాలు అందని పరిస్థితి
* అంబేడ్కర్ ఓపెన్, తెలుగు వర్సిటీలకు ఒక్కపైసా కేటాయించని వైనం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ల్యాబ్‌ల కోసం పరికరాల కొనుగోలు, నిర్మాణాలు, ఇతర అవసరాలు, కంప్యూటర్ విద్య, స్పోర్ట్స్‌కు మినహా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దగా నిధులు కేటాయించలేదు. అంతేకాదు వర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి కొత్త పీఆర్సీ మేరకు వేతన సవరణ చేసినా... ఆ మేరకు వేతనాల నిధులను మాత్రం పెంచలేదు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన మేరకే ఈసారీ కేటాయించారు. ఇటీవలే అధ్యాపకులు, ఉద్యోగులకు పెరిగిన డీఏకు సంబంధించీ నిధులివ్వలేదు. దీంతో వర్సిటీల అధ్యాపకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. కానీ డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన మేరకు వేతనాలు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి ప్రధాన వర్సిటీలకు కూడా కేటాయింపు పెంచకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉస్మానియాలో వేతనాల కోసం గత బడ్జెట్‌లో రూ.238 కోట్లు ఇవ్వగా... ఈసారీ అంతే కేటాయించారు. కాకతీయ వర్సిటీకి కూడా గత బడ్జెట్ తరహాలోనే 67.03 కోట్లు కేటాయించారు. ఇక తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి వాటి నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వలేదు. మంథని, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ కాలేజీలకు అత్తెసరు నిధులనే కేటాయించారు. గతేడాది సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజీకి రూ.50కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.14కోట్లే కేటాయించారు. మంథని కాలేజీకి గతేడాది రూ.143కోట్లు ఇవ్వగా... ఈసారి రూ.64.50కోట్లతో సరిపుచ్చారు
 
నిర్మాణాలు, ల్యాబ్‌లపై దృష్టి
డిగ్రీ, ఇంటర్ కొత్త కాలేజీల్లో మాత్రం పలు నిర్మాణాలు, ల్యాబ్ సదుపాయాల కల్పన, కంప్యూటర్ విద్య బోధన, నైపుణ్యాల పెంపు, శిక్షణలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్లకు రూ.6కోట్లు ఇచ్చారు. దీంతో సహా మొత్తంగా సదుపాయాల కల్పనకు రూ.46కోట్లు కేటాయించారు. డి గ్రీ కాలేజీల్లో నిర్మాణాలకు ఆర్‌డీఎఫ్ కింద రూ.98కోట్లు ఇచ్చారు.

మొత్తంగా ఉన్నత విద్యకు గత బడ్జెట్‌లో రూ.1,652.39కోట్లు ఇవ్వగా... ఈసారి రూ.1,720.97కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు మాత్రం నిధులు తగ్గాయి. 2015-16 బడ్జెట్‌లో రూ.509.21కోట్లు కేటాయించగా ఈసారి రూ. 443.02 కోట్లే ప్రతిపాదించారు. పాలిటెక్నిక్‌లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం గతేడాది రూ.18.38కోట్లు ఇస్తే ఈసారి రూ.47.07కోట్లు కేటాయించారు.

>
మరిన్ని వార్తలు