75 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్!

18 Jul, 2014 02:20 IST|Sakshi
75 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్!

* పథకాలకు నిధుల కొరత అడ్డంకి కాదు
* రైతులరుణాలు నాలుగైదేళ్లలో బ్యాంకులకు చెల్లిస్తాం
* ఓ న్యూస్ చానల్‌తో ముఖాముఖీలో సీఎం కేసీఆర్

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.75 వేల కోట్లకు పైగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. అందులో ప్రణాళిక వ్యయం రూ.35 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.40 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనితో పాటే హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరో 35 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు.

కాగా, బుధవారం రాష్ట్ర కేబినెట్  ఆమోదించిన నిర్ణయాల అమలుకు నిధుల కొరత అడ్డంకి కాబోదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఓ న్యూస్ చానల్ మూడుగంటల పాటు నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధరంగాలవారు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ వివరంగా సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో అపారమైన భూ, ఖనిజ సంపద, మానవ వనరులున్నాయని చెప్పారు.

భూముల క్రమబద్దీకరణ, పన్నుల పాతబకాయిల వసూళ్లు, కొత్త పరిశ్రమలు ఏర్పడితే వచ్చే ఆదాయం తదితర ఆదాయాలను సమన్వయపరిచి అదనంగా సొమ్ము సంపాదిస్తామన్నారు. లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణాల మాఫీకి రూ.19 వేల కోట్ల నిధులు అవసరమన్నారు. వాటిని నాలుగైదేళ్లలో వాయిదాపద్ధతిలో ప్రభుత్వమే వడ్డీతో బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు.
 
బయ్యారం,ఇనుముగుట్ట,సిద్దిపేటల్లో ఉక్కుకార్మాగారాలు...
ఖమ్మం జిల్లా బయ్యారంలో రూ.30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అందులో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా ఇనుముగుట్టలో రూ.10 కోట్లతో మరో ఉక్కు పరిశ్రమ, మెదక్ జిల్లా సిద్దిపేటలో రూ.15 వేల కోట్లతో ఇంకో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఉచిత నిర్బంధవిద్యను అమలు చేయడం తన అతిపెద్ద కల అని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి మండలంలోని ఓ పాఠశాలలో దీనిని అమలు చేస్తామన్నారు.ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితి గతులపై అధ్యయన కమిటీ నుంచి మూడు నాలుగు నెలల్లో నివేదిక తెప్పించుకుని,  12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సామాజిక పింఛన్లు స్వాహా చేస్తున్న అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే చర్యలు తీసుకోబోమన్నారు. ప్రభుత్వ ఏరివేతలో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు