వచ్చేనెలలోనే విస్తరణ!

13 May, 2016 07:39 IST|Sakshi
వచ్చేనెలలోనే విస్తరణ!

రాజ్యసభ ఎన్నికల తర్వాత జూన్‌ ఆఖరులో ముహూర్తం
* కేబినెట్‌లో ఆరుగురికి ఉద్వాసన.. అంతే సంఖ్యలో కొత్తవారికి చాన్స్‌
* పదవి కోల్పోయేవారిలో ఒకరు రాజ్యసభకు.. మిగతా వారికి పార్టీ పదవులు
* ఉత్తర తెలంగాణకు చెందిన ముగ్గురు మంత్రులు ఔట్‌!
* దక్షిణ తెలంగాణలో ఒకరికి, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరికి పదవీగండం
* తొలగించనున్న వారిలో ఇద్దరికి పార్టీ సెక్రటరీ జనరల్‌ పోస్టులు
* ఈసారి మహిళలకు ప్రాధాన్యం.. రేసులో కోవా లక్ష్మి, కొండా సురేఖ, పద్మా దేవేందర్‌రెడ్డి
* అనారోగ్యం కారణంగా చందూలాల్‌ను తప్పించే అవకాశం
* ఉత్తర తెలంగాణ నుంచి కేబినెట్‌లోకి డీఎస్, కొప్పుల ఈశ్వర్‌?


సాక్షి, హైదరాబాద్‌: ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? వచ్చేనెలలోనే విస్తరణ ఉంటుందా? దీనికి అవుననే అంటున్నాయి అధికార పార్టీలోని అత్యున్నతస్థాయి వర్గాలు! రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే జూన్‌ నెలాఖరులోగా కేబినెట్‌ విస్తరణ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత గడచిన ఏప్రిల్‌లోనే మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావించినా రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూన్‌కు వాయిదా వేసినట్లు తెలిసింది. జూన్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆరుగురికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అంతే సంఖ్యలో మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం లభించనుంది. మంత్రి పదవి కోల్పోతారని భావిస్తున్న వారిలో ఒకరిని రాజ్యసభకు పంపడంతో పాటు మిగిలిన ఐదుగురికి పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది.

ఎవరు ఔట్‌..? ఎవరు ఇన్‌..?
ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ముగ్గురు, రాజధానికి చెందిన ఇద్దరు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకరిని మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీలో రెండు సెక్రటరీ జనరల్‌ పోస్టులు ఉంటాయని, పార్టీలో సీనియర్లు అయిన ఇద్దరు మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఒకరిని మంత్రిపదవి నుంచి తప్పించి ఆయన సామాజిక వర్గానికే చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేకు (టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు) మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. సదరు సీనియర్‌ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ నిర్మాణ కంపెనీ యజమాని గట్టిగా కోరుతున్నారు. ఆ కంపెనీపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేసిన సమయంలోనూ ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే కంపెనీకి మద్దతుగా నిలిచారు.

రాజ్యసభకు వెళ్లేదెవరు?
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తెలంగాణకు వచ్చే రెండు సీట్లూ అధికార పార్టీకే దక్కనున్నాయి. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రి ఒకరిని రాజ్యసభకు పంపే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. రాజధానికి చెందినమంత్రిని రాజ్యసభకు పంపుతారని గడచిన ఏడాది కాలంగా ప్రచారంలో ఉన్నా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మరో సీనియర్‌ మంత్రి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రస్తుత ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది. దీనిపై ఇంకా కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదని, పరిస్థితులను బట్టి ఈ నెల చివరి వారంలో నిర్ణయం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఆ సీనియర్‌ మంత్రి మాత్రం రాష్ట్రంలోనే ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే ఒకసారి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ, ప్రభుత్వ అవసరాలు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు ఉంటాయని కేసీఆర్‌ ఆ సీనియర్‌ మంత్రితో చెప్పినట్లు సమాచారం.

కొత్తగా ఎవరికి అవకాశాలు?
మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరెవరికి అవకాశం దక్కుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. సామాజిక సమీకరణలను బట్టి దాదాపు డజను మంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ఈసారి మంత్రివర్గంలో మహిళలకు కచ్చితంగా స్థానం లభిస్తుందన్న సమాచారంతో బెర్త్‌ల కోసం ముగ్గురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కోవా లక్ష్మి, మెదక్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి కచ్చితంగా అవకాశం లభించవచ్చు. అనారోగ్య కారణాల వల్ల వరంగల్‌ జిల్లాకు చెందిన చందూలాల్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కోవా లక్ష్మికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చంటున్నారు.

ఇకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కొప్పుల ఈశ్వర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్‌ పేరు కూడా ప్రచారంలో ఉంది. శ్రీనివాస్‌కు రాజ్యసభ దక్కకపోతే మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జోగు రామన్నను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. రాజధానికి చెందిన నలుగురిలో ఇద్దరికి కచ్చితంగా ఉద్వాసన పలుకనున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరి స్థానాలను జిల్లాలకు చెందిన వారితోనే భర్తీ చేస్తారు. వరంగల్‌ జిల్లా నుంచి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పాటు స్పీకర్‌ మధుసూదనాచారి ఉన్నారు. ఈ జిల్లా నుంచి కొత్తగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా సురేఖ, వినయ్‌ భాస్కర్‌ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి కచ్చితంగా చోటు దొరుకుతుందంటున్నారు.

>
మరిన్ని వార్తలు