సింధుకు 5 కోట్లు, గోపీచంద్‌కు కోటి

20 Aug, 2016 23:02 IST|Sakshi
సింధుకు 5 కోట్లు, గోపీచంద్‌కు కోటి

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆమె ఎటూ హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. అలాగే ఆమె చేస్తానంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఇప్పటివరకు ఎంతోమంది ఛాంపియన్లను కోచ్ పుల్లెల గోపీచంద్ తయారుచేశారని, ఆయన చేతుల మీదుగానే సింధుతో పాట సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, కిదాంబి శ్రీకాంత్ లాంటి క్రీడాకారులు వచ్చారని.. ఈ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కోటి రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇస్తామని చెప్పారు.

ఇంతకుముందు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వరుసగా సంవత్సరం అంతా గెలుస్తూనే వచ్చిందని.. ఈ అమ్మాయి (సింధు) కూడా అలాగే గెలవాలని తెలంగాణ సర్కారు కోరుకుంటోందని తెలిపారు. ఈనెల 22వ తేదీన హైదరాబాద్ వస్తున్న పీవీ సింధుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నిర్ణయం తీసుకున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన హరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు కూడా తెలంగాణ తరఫున కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు