కేసీఆర్‌ మన్‌కీ బాత్‌

9 May, 2017 02:29 IST|Sakshi
కేసీఆర్‌ మన్‌కీ బాత్‌

ప్రధాని తరహాలో ప్రజలతో ముఖాముఖికి సీఎం యోచన
ప్రభుత్వ పథకాల ప్రచారమే ధ్యేయంగా ‘డిజిటల్‌’ మంత్రం
వివిధ వర్గాలవారితో పదిహేను రోజులకోసారి వీడియో కాన్ఫరెన్స్‌
ప్రగతి భవన్‌లో ప్రత్యేక స్టూడియో
జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు
సీఎం ప్రసంగాన్ని జనం నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు


సాక్షి, హైదరాబాద్‌
ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకునేందుకు, తన మనసులోని భావాలను జనంతో పంచుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. భారీ బహిరంగ సభల కంటే ఎంపిక చేసిన వర్గాలతో ముఖాముఖి మాట్లాడటం ద్వారానే ప్రభుత్వ పనితీరును ప్రజలకు బాగా వివరించవచ్చన్న అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు చెబుతున్నారు. ఈ దిశగా ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘ఈ–క్యాంపెయిన్‌’ ద్వారా ఎక్కువ మంది ప్రజలను చేరుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఈ వ్యూహం సత్ఫలితాలిచ్చిందని భావిస్తున్న సీఎం.. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పురమాయించారని తెలుస్తోంది. దేశ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లుగానే.. ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని అమలు చేయనున్నారని చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సీఎం కార్యాలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేస్తున్నారని, ఆ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిసింది.

ఎల్‌ఈడీ స్క్రీన్లలో లైవ్‌
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రధానంగా వివరించనున్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారని చెబుతున్నారు. ఇకపై ప్రగతి భవన్‌ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఆశ వర్కర్లు, అంగన్‌ వాడీ వర్కర్లు వంటి వారితో వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నేరుగా మాట్లాడబోతున్నారు. ముందుగానే ఎంపిక చేసిన జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో వివిధ వర్గాలవారిని సమీకరిస్తారు. హైదరాబాద్‌ నుంచి సీఎం నేరుగా లైవ్‌లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రజలు కూడా లైవ్‌లో సీఎంతో మాట్లాడడంతో పాటు వారి సమస్యలను చెప్పుకునే వీలుంటుంది. ప్రజాసమస్యలపై సీఎం వెంటనే స్పందించి అవసరమైన చర్యలకు సంబంధిత అధికారులను అక్కడిక్కడే ఆదేశిస్తారని చెబుతున్నారు. ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక జిల్లాలోని ప్రజలతో సీఎం ముఖాముఖి ఉంటుందందని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రజలు సీఎం ప్రసంగాన్ని చూసేలా భారీ స్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ వర్గాల ప్రజలను ప్రగతి భవన్‌కు రప్పించి సీఎం నేరుగా మాట్లాడారు. యాదవులు, మత్స్యకారులు, రైతులు ఇలా పలు వర్గాలతో సమావేశాలు జరిపారు. కానీ, పరిమిత సంఖ్యలోనే ఆయా వర్గాలను కలుసుకున్నారు. దీనికంటే ‘ఈ–పబ్లిసిటీ’ద్వారా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాల ప్రచారం
గత మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ తదితర పథకాలపై ఐదు నుంచి పది నిమిషాల నిడివిగల లఘు చిత్రాలను కూడా స్క్రీన్లపై ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ఇలా ప్రతి పదిహేను రోజులకోసారి విడతలవారీగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడతారు. ప్రభుత్వంలో పాలనా పరమైన లోపాలను సవరించుకునేందుకు ప్రజల నుంచి అందే సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటారు.

మరిన్ని వార్తలు