సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర పదవీ విరమణ!

1 Jan, 2017 02:36 IST|Sakshi
సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర పదవీ విరమణ!

పదవీకాలం పొడిగింపునకు
 కేంద్రం నుంచి రాని అనుమతి
శనివారం రాత్రి వరకూ సస్పెన్సే
పదవిలో కొనసాగింది నెల రోజులే
కొత్త సీఎస్‌ రేసులో ఎంజీ గోపాల్, ఎస్పీ సింగ్, ఆర్‌ఆర్‌ ఆచార్య


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర పదవీకాలం శనివారంతో ముగిసిపోయింది. నవంబర్‌ 30న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌చంద్ర కేవలం నెల రోజులే పదవిలో కొనసాగారు. వయసు నిబంధనల మేరకు ఆయన శనివారం (డిసెంబర్‌ 31)తో రిటైరవుతున్న నేపథ్యంలో.. పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. కానీ శనివారం రాత్రి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రదీప్‌ చంద్ర రిటైర్‌ అయినట్లేనని భావిస్తున్నారు.

నాలుగు రోజులుగా ఎదురుచూపు..
ప్రదీప్‌ చంద్ర పదవీకాలం పొడిగించేందుకు అనుమతించాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ప్రధానికి అందజేశారు. సీఎస్‌ పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనలకు సంబంధించిన ఫైలు డిసెంబర్‌ 27న ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరింది. ప్రధాని సంతకం చేస్తే అనుమతి లభిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని గత నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చాయి. శుక్రవారమే ఉత్తర్వులు రావచ్చని కూడా భావించారు. అయితే పదవీకాలం చివరి రోజైన శనివారం కూడా దీనిపై స్పందన రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ)తో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు రాత్రి 9 గంటలు దాటినా ప్రదీప్‌ చంద్ర పదవీకాలం పొడిగింపు అంశం తేలకపోగా... కొత్తగా సీఎస్‌ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు సైతం రాకపోవడంతో సస్పెన్స్‌ నెలకొంది.

మనస్సు మార్చుకున్న సర్కారు?
సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు గత సీఎస్‌ రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పెంచింది. అప్పట్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయడంతో.. రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. తాజాగా ప్రదీప్‌ చంద్ర పదవీకాలం పొడిగింపు కోసం కూడా విజ్ఞప్తి చేసినా... రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారితో పాటు కొన్ని సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా ప్రదీప్‌ చంద్ర పదవీకాలం పొడిగింపు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.

కొత్త సీఎస్‌గా ఎంజీ గోపాల్‌?
ప్రదీప్‌ చంద్ర పదవీకాలం పొడిగింపు లేనిపక్షంలో కొత్త సీఎస్‌ నియామకం అనివార్యం కానుంది. శనివారం రాత్రి, లేదా ఆదివారం ఉదయమే కొత్త సీఎస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. సీనియారిటీ ప్రకారం కొత్త సీఎస్‌ రేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎంజీ గోపాల్, ఎస్పీ సింగ్, రాజీవ్‌ రంజన్‌ ఆచార్యల పేర్లు వినిపిస్తున్నాయి. వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎంజీ గోపాల్‌ను సీఎస్‌గా నియమించవచ్చని చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు