సీఎస్‌ పదవీకాలం పొడిగింపు!

3 Jan, 2018 03:25 IST|Sakshi

ఈ నెల 31తో ముగియనున్న ఎస్పీ సింగ్‌ సర్వీసు3 నెలలు పొడిగించాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖకేంద్రం ఆమోదించటం లాంఛనమే!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరో మూడు నెలలపాటు సీఎస్‌ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఇటీవల లేఖ రాసింది. ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. ఈ నెల 31తో ఎస్పీ సింగ్‌ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పొడిగించాలని లేఖలో ప్రస్తావించింది. ప్రభుత్వం లేఖ రాయటంతోపాటు ఇటీవల ఎస్పీ సింగ్‌ కూడా ఢిల్లీకి వెళ్లి తనవంతుగా ఎక్స్‌టెన్షన్‌కు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దీంతో కేంద్రం ఆమోదించటం లాంఛనమేననే అభిప్రాయాలు ఐఏఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి సీఎస్‌గా పని చేసిన రాజీవ్‌ శర్మ పదవీ కాలాన్ని ఇదే తీరుగా రెండు దఫాలు పొడిగించారు. 1983 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్‌ సొంత రాష్ట్రం బిహార్‌.

మెప్పించిన సింగ్‌..
సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఏడాది కాలంగా తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండటంతోపాటు అధికార వర్గాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని ముందు నుంచీ ఆయన పర్యవేక్షిస్తున్నారు. సీఎంతోపాటు కేంద్రంలోని ముఖ్యులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు